శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని బైరి గ్రామ వాసులను గౌరమ్మకు నందెన్నకు పూజలు చేసుకోనివ్వడం లేదు. సోమవారం కూడా పోలీసు ఆంక్షలు కొనసాగడంతో గౌరీదేవి, నందెన్నలను ఓ ఇంటిలో ఉంచి బయట నుంచే పూజ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీలు అంబటి నిర్మలా, శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడారు. గడిచిన పాతికేళ్లుగా గ్రామంలో ఇలాంటి పరిస్థితి లేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గ్రామంలోనే కక్ష రాజకీయాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. అధికార పార్టీ వారు ఆదివారం రాత్రి గౌరమ్మను ఊరేగించారని, తమ ఇళ్ల వద్ద మాత్రం పోలీసులను మోహరించాలని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తండ్రి పరువు తీస్తున్నారని వారు దుయ్యబట్టారు. ఒక ఎంపీగానూ, కేంద్రమంత్రిగాను ఉంటూ కక్ష రాజకీయాలకు పూనుకోవడం ఏంటని ప్రశ్నించారు. సనాతన ధర్మం పాటిస్తున్నామంటూ కూటమి నేతలు చెబుతున్న పద్ధతి ఇదేనా అంటూ వారు ప్రశ్నించారు. దీనిపై గ్రామస్తులమంతా కలిసి ఎలక్షన్ కమిషన్‌ను, అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఇదే విషయంపై రూరల్ ఎస్‌ఐ సురేష్‌ను వివరణ కోరగా ఈ గ్రామంలో అల్లర్లు జరుగుతాయని ముందస్తు సమాచారం మేరకు మరికొద్ది రోజుల్లో ఎలక్షన్ ఉన్నందున పోలీసుల భద్రత వలయాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
బైరిలో గౌరమ్మకు పూజలు చేసుకోనివ్వని వైనం
కొనసాగుతున్న పోలీసు ఆంక్షలు
న్యాయ సహాయం కోరుతామంటున్న గ్రామస్తులు


