వజ్రపుకొత్తూరు రూరల్ : బస్టాండ్లో బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నా ఆపకుండా వెళ్లిపోతుండటం, కొన్నిసార్లు గమ్యస్థానాలకు చేరకుండానే దించేస్తుండటం పట్ల మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం గరుడఖండిలో గ్రామదేవత సంబరాలు జరగగా పాత జాతీయ రహదారిపై అధిక సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పోలీసులు స్పందించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. అదే సమయంలో టెక్కలి నుంచి పలాస వైపు ప్రయాణిస్తున్న బస్లు పలాస, కాశీబుగ్గ బస్టాండ్లకు వెళ్లకుండా ప్రయాణికులను అర్థాంతరంగా బెండి గేట్ వద్ద దింపేయడంతో పాటు బస్సులను తిరిగి టెక్కలి రహదారిపై మళ్లించారు. ఇదేంటని ఆర్టీసీ సిబ్బందిని ప్రశ్నించగా ఇక్కడే దిగిపోండంటూ చెప్పడంతో వారు అవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.


