● అందుకే ఆ పార్టీని నాయకులు, కార్యకర్తలు వీడుతున్నారు ● అల్లాడ సభలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ● టీడీపీ నుంచి 156 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరిక
జలుమూరు: వైఎస్సార్ సీపీ మరింత బలోపేతానికి అల్లాడ గ్రామమే ఓ పునాది అని మాజీ డిప్యూటీ సీఎం, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. 40 సంవత్సరాలుగా టీడీపీలో ఉంటున్న దుద్దు రాజేశ్వరరావు, ఆయన సోదరుడు నారాయణరావుతోపాటు సుమారు 156 కుటుంబాలు ఆ పార్టీని వీడి వైఎస్సార్ సీపీలోకి చేరడం హర్షణీయమని పేర్కొన్నారు. ఆదివారం అల్లాడలో రాజేశ్వరరావు నివాస సమీపంలో పార్టీ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణదాస్ మాట్లాడుతూ టీడీపీలో ఎంతకాలం పనిచేసినా ఎలా నట్టింట ముంచుతారో రాజేశ్వరరావు, నారాయణరావులను చూస్తే అర్ధం అవుతుందన్నారు. విలువైన కాలం, ఆస్తులు అమ్ముకొని నిజాయితీగా సేవలు అందించిన వారిని టీడీపీ నిలువునా మోసం చేసిందన్నారు. పార్టీ అధినేత నుంచి స్థానిక ఎమ్మెల్యే రమణమూర్తి వరకూ టీడీపీ నాయకులు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాకు, నరసన్నపేట నియోజకవర్గానికి చేసిందేంటో చెప్పాలని ప్రశ్నించారు. వంశధార ప్రాజెక్టు, రైతుల కష్టాలు, యూరియా కొరతను పట్టించుకోకుండా చంద్రబాబు నుంచి స్థానిక ఎమ్మెల్యే వరకూ దాచుకో దోచుకో అన్న చందంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
శ్యామలరావు త్యాగం గొప్పది..
వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి ధర్మాన కుటుంబంతో అత్యంత సన్నితమైన బంధం కలిగిన స్థానిక సీనియర్ నాయకుడు మొజ్జాడ శ్యామలరావు త్యాగం గొప్పదని కృష్ణదాస్ కొనియాడారు. తనకు చెందాల్సిన సర్పంచ్ పదవిని సైతం వదిలి దుద్దు రాజేశ్వరరావు కుటుంబంతో కలిసి పనిచేసేందుకు అన్ని వర్గాలను కలుపుకొని తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. ఈ విషయంలో మాజి ఎంపీపీ బగ్గు రామకృష్ణ, శ్యామలరావులు అలుపెరుగని కృషి చేశారని కొనియాడారు. అల్లాడకు దుద్దు ఉషారాణి, అల్లాడపేటకు కల్యాణం చిన్నమ్మడులను సర్పంచ్ అభ్యర్థులుగా ప్రకటించామని, వీరిని గెలిపించేందుకు అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో టీడీపీ హత్యా రాజకీయాలను పెంచి పోషిస్తోందని కృష్ణదాస్ తీవ్రంగా విమర్శించారు. అల్లాడపేట మాజీ సర్పంచ్ కల్యాణం అచ్చెన్న కూడా దశాబ్దాలుగా టీడీపీలో ఉన్న వ్యక్తి అని, ఆ పార్టీ విధానాలు నచ్చక వైఎస్సార్సీపీలోకి చేరిన కొద్ది నెలలకే హత్యకు గురికావడం ఎంతో బాధకలిగించిందన్నారు. పార్టీ కార్యకర్తలకు ఏ చిన్న కష్టం కలిగినా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
– నియోజకవర్గ యువ నాయకుడు, పోలాకీ జెడ్పీటీసీ మాజీ సభ్యులు ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ అల్లాడ గ్రామాన్ని స్పూర్తిగా తీసుకొని మరికొన్ని గ్రామాలు వైఎస్సార్సీపీలోకి చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకువస్తున్నాయని, అలాంటి వారినరి స్థానిక నాయకత్వం ప్రోత్సహించి పార్టీని మరింత బలోపేతం చేయాలని
పిలుపునిచ్చారు. ఈ విషయంలో అల్లాడపేటకు చెందిన కల్యాణం శ్రీనివాసరావు చేసిన ప్రయత్నం అభినందనీయమన్నారు. అనంతరం దుద్దు రమేష్, తాబేలు కృష్ణ, రాజబాబు, బుజ్జి, అప్పారావు, తట్ట హరి, గొర్లె ఢిల్లీశ్వరరావు, ధనుంజయ, పాలకొండ ఆదినారాయణ, పూతి చంద్రరావు, రాంబాబు, శ్రీనివాసరావు, జోగి గణేష్, శ్రీనివాసరావు, లావేటి శ్రీను, గంగు రంగ, మొగిపులి మహేశ్వరరావు, దాము నారాయణరావుతోపాటు 156 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరగా వీరందరికీ కృష్ణదాస్ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో ధర్మాన రామదాస్, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ అభ్యర్థి ధర్మాన అనిత, జెడ్పీటీసీ అభ్యర్థి బగ్గు రామకృష్ణ, ఎంపీటీసీ అభ్యర్థి మొజ్జాడ భాస్కరరావు, మాజి ఎంపీపీ వాన గోపి, మండల పార్టీ అధ్యక్షుడు కనుసు సీతారాం, పరిసర గ్రామాల నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.


