● ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ ● క్యాబిన్లో ఇరుక్కుపోయి డ్రైవర్ మృతి
టెక్కలి రూరల్: కె.కొత్తూరు గ్రామ సమీప జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అన్వర్ గ్రామానికి చెందిన డ్రైవర్ రవియాదవ్(27) కంటైనర్ లారీతో శ్రీకాకుళం వైపు వస్తుండగా టెక్కలి సమీపంలోని కె.కొత్తూరు గ్రామ సమీపంలోకి వచ్చే సరికి రోడ్డు పక్కన మరమ్మతులకు గురై ఆగి ఉన్న లారీని అతివేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ఘటనలో లారీ క్యాబిన్ నుజ్జయిపోవడంతో అందులో ఇరుక్కుపోయాడు. స్థానికులు, హైవే సిబ్బందితో చేరుకుని అతి కష్టమ్మీద డ్రైవర్ను బయటకు తీసి టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. రోడ్డు ప్రమాదం కారణంగా ట్రాఫిక్ స్తంభించడంతో హైవే సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకుని ట్రాఫిక్ని చక్కదిద్దారు. టెక్కలి పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


