శ్రీకాకుళం క్రైమ్ : జాగ్రత్తమ్మా.. ప్రతి ఇంటిలో వినిపించే డైలాగు ఇది. అమ్మాయి ఊరికి వెళ్లినా, బడికి వెళ్లినా, ఫంక్షన్‌కు వెళ్లినా.. ఆఖరికి గుడికి వెళ్లినా సరే గడప దాటిన ప్రతిసారీ జాగ్రత్త చెప్పి తీరుతాం. అమ్మానాన్నలే కాదు ప్రభుత్వ శాఖలు కూడా అమ్మాయిల భద్రత కోసం నిరంతరం శ్రమిస్తుంటా యి. ఆయా నంబర్లకు కాల్ చేస్తే చాలు.. ఇట్టే వచ్చి వాలిపోతాయి. ఈ నంబర్లు అమ్మ, నాన్న, అన్న దగ్గర, తమ్ముడి దగ్గర ఉండి తీరాలి. మన ఇంటి మహాలక్ష్మిని కాపాడుకునేందుకు ఆ మాత్రం అవగాహన పెంచుకుని తీరాలి.
పోక్సో చట్టం : 18 ఏళ్ల లోపు బాలికలపై లైంగిక దాడులు, వేధింపుల నుంచి రక్షణ కల్పించే అత్యంత కఠినమైన చట్టం.
నిర్భయ చట్టం : మహిళలపై జరిగే యాసిడ్ దాడులు, లైంగిక వేధింపులు, స్టాకింగ్ (వెంబడించడం), వోయరిజం (ఫొటోలు రహస్యంగా తీయడం) వంటి నేరాలకు ఈ చట్టం వర్తిస్తుంది.
కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోష్ యాక్ట్): ఉద్యోగం చేసే ప్రదేశాల్లో మహిళల కు, యువతుకు సురక్షిత వాతావరణం కల్పించడం, లైంగిక వేధింపులను అరికట్టడం ఈ చట్టం పని.
జీరో ఎఫ్‌ఐఆర్ : ఒక మహిళపై నేరం జరిగేటప్పుడు పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా క్షణాల్లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయొచ్చు. ఆ తర్వాత దానికి సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేస్తారు.
వరకట్న నిషేధ చట్టం : వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం రెండూ నేరమే. ఈ చట్టం ప్రకారం కఠిన శిక్షలు పడతాయి.
గృహహింస నిరోధక చట్టం : ఇంట్లో భర్త లేదా ఇతర కుటుంబసభ్యుల నుంచి ఎదురయ్యే శారీరక, మానసిక, ఆర్థిక వేధింపుల నుంచి మహిళలకు రక్షణ క ల్పించే చట్టమిది.


