జల దిగ్బంధం | - | Sakshi
Sakshi News home page

జల దిగ్బంధం

Sep 27 2026 1:46 AM | Updated on Sep 27 2026 1:46 AM

జల దిగ్బంధం

ఇంకా ముంపులోనే గ్రామాలు

అల్లెన వద్ద పెరిగిన నాగావళి వరదనీరు

సుమారు 15 గ్రామాలకు రాకపోకలు బంద్‌

జలమయమైన పంట పొలాలు

ఆమదాలవలస రూరల్‌:

నాగావళి నది ఉగ్రరూపం దాల్చడంతో పలు గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే చిక్కుకున్నా యి. బూర్జ మండలం అల్లెన గ్రామం వద్ద గట్టుపైకి వరద నీరు చేరడంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జి.కె.వలస, కొరపాం, నిమ్మతొర్లివాడ, పాత నిమ్మ తొర్లివాడ, కొత్తవలస, చీమలవలస, కొర్లకోట, తొగరాం, కలివరం తదితర గ్రామాలకు వరద ముప్పు తప్పడం లేదు. పంట పొలాలన్నీ జలమయంగా మారడంతో రైతు లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అల్లెన వద్ద నాగావళి వరద నీరు గట్టుపైకి చేరి ప్రవహించడంతో గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. సుమా రు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ముంపు ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటన

శ్రీకాకుళం రూరల్‌: మండల పరిధిలోని మోపసుబందరు, కిల్లిపాలెం, కళ్లేపల్లిలో ముంపు ప్రాంతాలను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ శనివారం పరిశీలించారు. అధికారులు చేపట్టిన చర్యలను ఆయన పరిశీలించి బాధితులకు తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదే విధంగా, రాగోలు గ్రామంలో ముంపునకు గురైన పంట పొలాలను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాలం, జిల్లా అధ్యక్షుడు ఎస్‌.తేజేశ్వరరావు పరిశీలించారు.

ముంపు పొలాల పరిశీలన

కవిటి: మండలంలోని బొరివంక, బిగొనపపుట్టుగ రెవెన్యూ గ్రామాల్లో ముంపునకు గురైన పంట పొలాలను జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, ట్రైనీ కలెక్టర్‌ హరి ఓం పాండ్యా శనివారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు ప్రత్యేకాధికారి సీహెచ్‌ చంద్రశేఖర్‌, తహసీల్దార్‌ టి.కల్యాణచక్రవర్తి, వ్యవసాయాధికారి పి.శ్రీదేవి, మండలపరిషత్‌ ఏఓ కె.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పంట నష్టాన్ని నివారించండి: కలెక్టర్‌

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: వరద ముంపునకు గురైన వ్యవసాయ పొలాల్లో పేరుకుపోయిన నీటిని తక్షణమే బయటకు పంపి పంట నష్టాన్ని నివారించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ వరద ప్రభావిత రైతుల వివరాలను నమోదు చేసి, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల ప్రకారం వారికి అవసరమైన యూరియా, పొటాష్‌ ఎరువులను అందించేందుకు జాబితాలు సిద్ధం చేయాలని సూచించారు. నివాస ప్రాంతాలు, ఇళ్లలోకి చేరిన బురదను యుద్ధ ప్రాతిపదికన శుభ్రం చేయించాలన్నారు. పైప్‌లైన్లు మునిగిపోయిన ప్రాంతాల్లో నీటి నాణ్యతా పరీక్షలు పూర్తి చేసి, స్వచ్ఛత ధ్రువీకరణ పొందిన తర్వాతే తాగునీటి సరఫరా పునరుద్ధరించాలని స్పష్టం చేశారు.

తుఫాన్‌ నష్టాల గుర్తింపు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లాలో నాలుగు రోజులపాటు కురిసిన వర్షాలకు వివిధ విభాగాలకు భారీగా నష్టం వాటిల్లింది. వ్యవసాయానికి సంబంధించి వరి, ఇతర పంటలు 11973.2 హెక్టార్లు, హార్టీకల్చర్‌లో 762.6 హెక్టార్లలో నష్టం వాటిల్లగా ఆయిల్‌పామ్‌ చెట్లు 255, కొబ్బరి చెట్లు 920 కూలిపోయాయి. 177 గృహాలు ప్రభావితమయ్యాయి. రెండు పశువులు, పది వరకు గొర్రెలు, మేకలు చనిపోయాయి. ఆర్‌అండ్‌బీ రోడ్లు 382 కిలోమీటర్ల మేర పాడయ్యాయి. పంచాయతీరాజ్‌ రోడ్లు నాలుగు చోట్ల, మున్సిపల్‌ రోడ్లు 1.3 కిలోమీటర్ల మేర పాడయ్యాయి. 305 వీధి లైట్లు పాడయ్యాయి. మైనర్‌ ఇరిగేషన్‌ పనులు 189 నాశనమయ్యాయి. చేనేత సామగ్రికి రూ.40 వేలు నష్టం వాటిల్లింది. విద్యుత్‌ శాఖకు సంబంధించి 33–11కేవీ ఫీడర్లు 55, 11కేవీ ఫీడర్లు 409, 33/1 కేవీ సబ్‌ స్టేషన్లు 96, 33 కేవీ పోల్స్‌ 8, 11కేవీ పోల్స్‌ 244, ఎల్‌టీ పోల్స్‌ 284, డీటీ ట్రాన్మ్‌ఫార్మర్లు 84 దెబ్బతిన్నాయి.

రహదారులు ఛిద్రం

బూర్జ: నాగావళి నది ఉగ్రరూపం దాల్చడంతో తీర గ్రామాల రోడ్లు అతలాకుతలమయ్యాయి. శనివారం నాటికి ఇంకా వరి పొలాలు వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. వరద ప్రభావంతో అల్లెన, లక్కుపురం, బూర్జ, గిరడపేట, కాఖండ్యాం, లంకాం తదితర గ్రామాల రోడ్లు ఛిద్రమయ్యాయి. అల్లెన, లక్కుపురం, బూర్జ, గిరడపేట, కాఖండ్యాం, లంకాం గ్రామాల్లో పంట పొలాలు వరద నీటలోనే ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement