మనీ ఎక్స్చేంజ్‌ పేరుతో దారి దోపిడీ | - | Sakshi
Sakshi News home page

మనీ ఎక్స్చేంజ్‌ పేరుతో దారి దోపిడీ

Sep 27 2026 1:34 AM | Updated on Sep 27 2026 1:34 AM

మనీ ఎక్స్చేంజ్‌ పేరుతో దారి దోపిడీ నాగావళి నదిలో వ్యక్తి గల్లంతు

ద్వారకానగర్‌ (విశాఖ): మనీ ఎక్స్చేంజ్‌ పేరుతో నిందితులు ముగ్గురు బాధితులను బురిడీ కొట్టించి రూ.68 లక్షల నగదు, పది తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. టెక్కలి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న రమేష్‌కు, అతని స్నేహితుడికి ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తుల ద్వారా డాలర్ల మార్పిడి వ్యవహారం ఏర్పడింది. డాలర్లు అందజేస్తే అందుకు సమానమైన భారత కరెన్సీ చెల్లించేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి డైమండ్‌ పార్క్‌ నుంచి హైవే వైపు వెళ్లే మార్గంలో రమేష్‌, అతని భార్య, స్నేహితుడు కారులో నగదుతో వేచి ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ద్విచక్ర వాహనంపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. ఆన్‌లైన్‌లో పరిచయమైన రాజు అనే వ్యక్తి తమను పంపించాడని చెప్పి బాధితులను నమ్మించారు. అనంతరం కారులో ఉన్న వారిపై దాడి చేసి రెండు బ్యాగులను ఎత్తుకెళ్లారు. వాటిలో రమేష్‌ స్నేహితుడి బ్యాగులో రూ.50 లక్షల నగదు, రమేష్‌ బ్యాగులో రూ.18 లక్షల నగదు, 10 తులాల బంగారు ఆభరణాలు ఉన్నట్లు బాధితులు తెలిపారు. ద్వారకనగర్‌ క్రైమ్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రాజు బృందం ముందుగానే వేసిన స్కెచ్‌గా ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చారు.

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లాకేంద్రంలోని డేఅండ్‌నైట్‌ సమీప నాగావళి వంతెన పైనుంచి దూకి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. గుజరాతిపేట వెంకటేశ్వరనగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ దువ్వు మోహనరావు శుక్రవారం రాత్రి నుంచి కనిపించడం లేదని, డేఅండ్‌నైట్‌ వంతెన వద్ద కొందరు వ్యక్తులు మోహనరావు వేసుకునే వస్త్రాలను పోలికపట్టి నదిలో దూకేసినట్లు తనతో చెప్పారని మోహనరావు కుమార్తె లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతేడాది ఆర్థిక సమస్యలతో మోహనరావు భార్య రాజ్యలక్ష్మి ఇదే వంతెనపైనుంచి దూకి గల్లంతై గనగళ్లవానిపేటలో మృతదేహమై తేలిందని, ఆ మనస్థాపంతో మోహనరావు ఎప్పుడూ దిగాలుగా ఉండేవారని కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. రాత్రి భోజనం చేసిన మోహనరావు 8.30 గంటల నుంచి కనిపించలేదని పేర్కొనడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement