సంతబొమ్మాళి:
సంతబొమ్మాళి పంచాయతీ తెనిగిపెంటలో కిడ్నీ వ్యాధులపై ‘సాక్షి’లో ప్రచురితమైన వార్త అధికారుల్లో కదలిక తెప్పించింది. మంత్రి అచ్చెన్నాయుడు గ్రామ పరిస్థితిని స్వయంగా పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు సంతబొమ్మాళి పీహెచ్‌సీ పరిధిలోని తెనిగిపెంట గ్రామంలో శనివారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డీఎంహెచ్‌ఓ ఈఎన్‌వీ నరేష్‌కుమార్ శిబిరానికి హాజరై పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గ్రామంలోని కొంతమంది కిడ్నీ వ్యాధి బాధితులను పరీక్షించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గ్రామ ప్రజలతో మాట్లాడి వారి జీవన విధానం, ఆహారపు అలవాట్లు తదితర అంశాలపై వివరాల సేకరించారు. ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ ద్వారా ఇప్పటికే పరీక్షించిన నీటి నమూనాల ఫలితాలను డీఎంహెచ్‌ఓ పరిశీలించారు. నీరు సురక్షితంగా ఉందని ధ్రువీకరించారు. కిడ్నీ వ్యాధి స్క్రీనింగ్‌ను మరింత సమగ్రంగా చేపట్టాలని ఆదేశించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ సంతబొమ్మాళి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. వైద్య సేవల నిర్వహణ, రోగులకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు.


