అవగాహన కల్పిస్తున్నాం..
● ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేస్తున్న కేంద్రం
● వినియోగించుకోవాలంటున్న అధికారులు
నందిగాం: చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు కార్డులు అందజేస్తోంది. సంబంధిత శాఖ ద్వారా పెహచాన్ కార్డులను జారీ చేస్తోంది. మగ్గం నేసే కార్మికులకు, చేనేత అనుబంధ పనులు చేసేవారికి మేలు చేసేందుకు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్ ద్వారా ఉచితంగా పెహచాన్ కార్డులను పంపిణీ చేస్తోంది. ఈ గుర్తింపు కార్డుల వల్ల చేనేత కార్మికులకు అధికారిక గుర్తింపు లభించడంతో పాటు ప్రభుత్వం అందించే చేనేత సంక్షేమ పథకాలు పొందడానికి, రాయితీలు, శిక్షణ, పరికరాలు వంటి ప్రయోజనాలకు అర్హత నిర్ధారణలో ఈ కార్డులు ఉపయోగపడతాయి. బ్యాంకు రుణాలు, బీమా తదితర పధకాల్లో గుర్తింపుగా ఉపయోగపడే అవకాశం ఉంది. చేనేత వృత్తిగా జీవిస్తున్న వారందరూ ఈ–పెహచాన్ ఆన్‌లైన్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. ఆధార్ కార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫొటో, బ్యాంకు ఖాతా వివరాలు, సంతకం, ఫోన్ నంబరు, వృత్తికి సంబంధించిన వివరాలు సమర్పిస్తే ఆ వివరాల ప్రకారం చేనేత శాఖకు సంబంధించిన అధికారులు నేరుగా దరఖాస్తు చేసుకున్న కార్మికుని ఇంటికి వచ్చి పరిశీలిస్తారు. దరఖాస్తుదారులు మగ్గం నేస్తున్నారా లేదా అనుబంధ పనులైన రాట్నం నుంచి నూలు వడకడం, కండెలు పట్టడం, ఆసు తిప్పడం వంటివి చేస్తున్నారా అనేది పరిశీలించి వాటిని వీడియో రికార్డు చేసి ధ్రువీకరిస్తారు. అనంతరం నెల రోజుల్లోగా కార్డులను జారీ చేస్తారు. దరఖాస్తుదారుడు ఆన్‌లైన్‌లోనే కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మగ్గం నేసే కార్మికునికి గులాబీ, అనుబంధ పనులు చేసేవారికి నీలం రంగు కార్డులు జారీ చేస్తారు.
ఉపయోగాలెన్నో..
● పెహచాన్ కార్డుల వల్ల ముద్ర రుణాలు పొందవ చ్చు. ●నేత కార్మికులకు అవసరమైన మగ్గం, డాబీ, ఆసు మిషన్, వర్క్‌షెడ్ వంటివి రాయితీపై పొందవచ్చు.● మార్కెటింగ్‌పై శిక్షణ పొందవచ్చు. ● కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే బీమా పథకాలు పొందవచ్చు. ● కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు లభిస్తాయి. ● నేతన్న నేస్తం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సదుపాయాలు పొందవచ్చు.
పెహచాన్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ విషయమై జిల్లాలోని చేనేత కార్మికులకు అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలో సుమారు 1750 మంది మగ్గం నేసే కార్మికులు, వెయ్యి మంది అనుబంధ కార్మికులు ఉన్నారు. వీరంతా కార్డులను సద్వినియోగం చేసుకోవాలి.
– టి.జనార్దనరావు,
ఏడీ చేనేత జౌళిశాఖ, శ్రీకాకుళం


