ఇచ్ఛాపురం రూరల్: పాలతో వెళ్తున్న వ్యాన్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ప్రయాణికులు తీవ్ర గాయాలపాలైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కవిటి మండలం సీమూరుకు చెందిన తాపీమేసీ్త్ర శేఖర్ ముగ్గురు మహిళా కూలీలతో ఆటోలో ఇచ్ఛాపురం మండలం పెద్దలక్ష్మీపురం వెళ్తుండగా ఎదురుగా వస్తున్న పాలవ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో రామయ్యపట్నంకు చెందిన లండ కాముడమ్మ మోచేతికి, మేసీ్త్ర శేఖర్ తలకు తీవ్రగాయాలయ్యాయి. మిగతా ఇద్దరు మహిళలు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఇచ్ఛాపురంలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, కాముడమ్మను మెరుగైన చికిత్సకు శ్రీకాకుళంలో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. శేఖర్ తలకు కుట్లు వేసి చికిత్స అందజేస్తున్నారు.
వివాహిత ఆత్మహత్య
ఇచ్ఛాపురం: పట్టణంలోని దానంపేట కు చెందిన వివాహిత కె.మౌనిక(28) ఆత్మహత్య చేసున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన కొండక వీరభద్రస్వామి (రిటైర్డ్ కోర్టు ఉద్యోగి), అరుణకుమారి (రిటైర్డ్ మున్సిపల్ స్కూల్ హెచ్‌ఎం) దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్దమ్మాయి మౌనిక విశాఖపట్నంలో పీజీ పూర్తిచేసి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. విశాఖకు చెందిన రమాకాంత్‌ని ప్రేమించి 2019లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కవల పిల్లలు. దంపతులు పోచారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని సింగపూర్ టౌన్‌షిప్ సమీపంలోని గెలాక్షి టవర్స్‌లో నివాసముంటున్నారు. భర్త సాఫ్ట్‌వేర్ కంపెనీలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నారు. ఏం జరిగిందో గానీ ఆదివారం భర్త ఇంట్లో ఉండగానే మౌనిక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోచారం పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మౌనిక మృతితో దానంపేటలో విషాదఛాయలు అలముకున్నాయి.


