సొమ్ములిస్తేనే శుద్ధజలం! | - | Sakshi
Sakshi News home page

సొమ్ములిస్తేనే శుద్ధజలం!

Sep 18 2026 12:51 AM | Updated on Sep 18 2026 12:51 AM

డొంకూరు ఉన్నత పాఠశాలకు

60 రోజులుగా ట్యాంకర్‌ నీరే దిక్కు

ఐదు వేల లీటర్లకు రూ.1,750

చెల్లిస్తున్న గ్రామ పంచాయతీ

ఇచ్ఛాపురం రూరల్‌:

పాఠశాల విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించాల్సిన పరిస్థితుల్లో...డబ్బులు చెల్లిస్తేనే శుద్ధజలం అందుతున్న వైనం మత్స్యకార గ్రామమైన ఇచ్ఛాపురం మండలం డొంకూరు ఉన్నత పాఠశాలలో నెలకొంది. వంతెనల నిర్మాణ పనుల కారణంగా పాఠశాలకు గతంలో అందుతున్న రక్షిత మంచినీటి సరఫరా పైపులైన్‌ సుమారు 160 మీటర్లు మేర తొలగించడంతో సుమారు 60 రోజులుగా ట్యాంకర్‌ నీటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో 300 మందికి పైగా విద్యార్థులు తాగేందుకు, మధ్యాహ్న భోజనం వండేందుకు ఇదే నీటిని వినియోగిస్తున్నారు.

రూ.1,750 చెల్లిస్తే 5వేల లీటర్లు..

పాఠశాలకు రెండు రోజులకు ఒకసారి ఈదుపురం ఎన్టీఆర్‌ సుజలధార ప్రాజెక్ట్‌ నుంచి ట్యాంకర్‌ ద్వారా 5 వేల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ఇందుకు ఎన్టీఆర్‌ సుజలధార ప్రాజెక్టు–పలాస వారికి గ్రామ పంచాయతీ నుంచి ఒక్కో ట్యాంకుకు రూ.1,750 చెల్లిస్తున్నట్లు పంచాయతీ అధికారులు చెబుతున్నారు. విద్యార్థులకు తాగునీరు అందించేందుకు స్థానిక సంస్థ నిధుల నుంచి ఇలా నిరంతరం వ్యయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నీటికి రుసుమా?

ఎన్టీఆర్‌ పేరుతో నడుస్తున్న ఎన్టీఆర్‌ సుజలధార ప్రాజెక్టు నుంచి పాఠశాల విద్యార్థులకు తాగునీరు అందించేందుకు రుసుము వసూలు చేయడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వందలాది మంది విద్యార్థులకు ఉచితంగా సురక్షిత తాగునీరు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

శాశ్వత పరిష్కారమెప్పుడో?

వంతెనల నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో పాఠశాలకు రక్షిత మంచినీటి సరఫరాను పునరుద్ధరించడంపై అధికారులు దృష్టి సారించాల్సి ఉందని స్థానికులు అంటున్నారు. ట్యాకర్లపై ఆధారపడటం వల్ల పంచాయతీకి అదనపు భారం పడటంతో పాటు రెండు రోజులకు ఒకసారి వచ్చే నీటితో 300 మందికి పైగా విద్యార్థుల అవసరాలు తీర్చడం ఎంత వరకు సాధ్యమన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

పాఠశాలకు శాశ్వతంగా రక్షిత మంచినీటి సరఫరా పునరుద్ధించాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.

మరమ్మతులు చేపట్టాలి

వంతెనల నిర్మాణం కారణంగా పైప్‌లైన్‌ పూర్తిగా పాడైంది. రెండు నెలలుగా పాఠశాలకు రక్షిత మంచినీటి పథకం ద్వారా మంచినీరు రాకపోవడంతో ఎన్టీఆర్‌ సుజలధార నిర్వాహకులను పంచాయతీ, ఎంపీడీఓ ద్వారా సంప్రదించాం. పాఠశాలకు ఉచితంగా నీటిని సరఫరా చేయలేమని చెప్పడంతో ఒక్కో ట్యాంకుకు రూ.1,750లు పంచాయతీ ద్వారా వెచ్చించి తాగునీరు అందిస్తున్నారు. వంతెన కాంట్రాక్టర్లు తక్షణమే స్పందించి పైప్‌లైన్‌ పనులు చేపట్టి పాఠశాలకు మంచినీటిని సరఫరా చేయాలి.

– బుడ్డ కళ్యాణ్‌, యువకుడు, డొంకూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement