● ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ సవాల్
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): డీఎస్సీలో అక్రమాలు చేసి అన్నీ సక్రమాలే అంటూ ఎమ్మెల్యే కూన రవికుమార్ నిస్సిగ్గుగా చెప్పడం దారుణమని వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ మండిపడ్డారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడు తూ ఫేక్ సర్టిఫికెట్లతో రాష్ట్రంలో 3.40 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో కూన రవికుమార్ ఆడుకోవడం సరికాదన్నారు. చేసేవన్ని దొంగపనులు, వాటిని కప్పిపుచ్చుకోవడానికి నోరుంది కదా అని పెద్ద పెద్ద కేకలు వేసి అరిస్తే అబద్ధాలు నిజమైపోవన్నారు. జీవో నెంబర్ 47లో ఏ లోపాలు లేకుంటే మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించిన వెంటనే మరో జీవో 56ని ఎందుకు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. నిజంగా నిరుద్యోగులపై చిత్తశుద్ధి ఉంటే ఆధారాలతో సహా బహిరంగ చర్చకు ఈ నెల 22న ఆమదాలవలస వైఎస్సార్ విగ్రహం వద్దకు రావాలని, లేదా ఏదైనా వేదిక మీరు చెప్పినా ఆధారాలతో నేను వస్తానని సవాల్ విసిరారు. ఫామ్–2లో స్పోర్ట్స్‌కు సంబంధించి సాఫ్ట్‌బాల్ కార్యదర్శి సంతకాలుంటేనే అర్హులుగా భావిస్తామని చెబితే అధ్యక్షులుగా ఉన్న కూన రవికుమార్ సంతకాలు ఎలా చెల్లుబాటవుతాయని మండిపడ్డారు. కేవలం నాలుగు మాత్రమే తాను సంతకాలుపెట్టి ఇచ్చానని కూన చెప్పడం దారుణమన్నారు. మొత్తం 37మందికి సాఫ్ట్‌బాల్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలిస్తే అందులో తన దగ్గరే 25 మందికి కూన రవి సంతకాలతో ఉన్నాయని, ఇంకా మిగిలినవి ఉద్యోగాలు రానివి దరఖాస్తు చేసుకున్నవారు ఇంకెంతమంది ఉన్నారో, ఎంతమంది దగ్గర ఎన్ని లక్షలు దోచుకున్నారో తెలియదన్నారు. స్పోర్ట్స్ కోటాలో 2025 మే 31 చివరి తేదీగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారని, అయితే 2025 జూలై 16న జారీచేసిన సర్టిఫికెట్లు ఎలా చెల్లుబాటు అవుతాయో చెప్పాలన్నారు. ఫేక్ సర్టిఫికెట్‌తో ఉద్యోగం పొందిన షేక్‌సబ్బీర్, అశోక్‌కుమార్‌లకు ఎలా ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలన్నారు. నిరుద్యోగులపై చిత్తశుద్ది ఉంటే తక్షణమే సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఇంటర్‌లో మ్యాథ్స్ వారికి 10 సబ్జెక్టులుంటాయని అనడం దారుణమని, కనీసం ఎన్ని సబ్జెక్టులుంటాయో తెలియని మీరు చదువుకోసం మాట్లాడం సిగ్గుచేటన్నారు. చూసిరాసి పాసైతే ఏయే గ్రూపులకు ఎన్ని సబ్జెక్టులుంటాయో ఎలా తెలుస్తుందన్నారు. గ్లోబల్‌కి..గోబెల్‌కి తేడా తెలియని కూన తమ నాయకుడి కోసం మాట్లాడటం తగదన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్‌కుమార్, సరుబుజ్జిలి మండల అధ్యక్షుడు బెరవ మల్లేశ్వరరావు, కోరాడ రమణమూర్తి, పొడుగు శ్రీనివాసరావు, చింతాడ ప్రసాదరావు, ఈశ్వరరావు, సురవరపు నాగేశ్వరరావు, చిన్నారావు, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.


