గార: బోరవానిపేట పంచాయతీ రాష్ట్రం నుంచి చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్‌గా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పోటీలకు నామినేట్ అయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఐఎస్‌ఓ సర్టిఫికెట్ ప్రదానం చేసింది. గురువారం అమరావతిలో జరిగిన కార్యక్రమంలో పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ నుంచి డిప్యూటీ ఎంపీడీవో రమేష్, పంచాయతీ సెక్రటరీ బి.కృష్ణవేణి ఐఎస్‌ఓ సర్టిఫికెట్ అందుకున్నారు. గుడ్ గవర్నెన్స్ నేపథ్యంలో సర్టిఫికెట్ అందజేస్తున్నట్లు వారు తెలిపారు.
20న ఉత్తరాంధ్ర స్థాయి వాలీబాల్ పోటీలు
జి.సిగడాం: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఉన్న వాలీబాల్ క్రీడాకారులకు జి.సిగడాం మండలం మెట్టవలస గ్రామంలో ఈ నెల 20న ఉత్తరాంధ్ర స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని మల్లికార్జున యువజన సంఘం సభ్యులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగే ఈ పోటీల్లో ప్రథమ బహుమతి రూ. 20 వేలు, రెండో బహుమతికి రూ.10 వేలు, మూడో బహుమతికి రూ. 5 వేలు, నాలుగో బహుమతి కింద రూ.3 వేలు చొప్పున అందిస్తామని వివరించారు. ఆసక్తి గల జట్లు 63016 31609 నంబర్‌ను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
21న అప్రెంటిస్ మేళా
ఎచ్చెర్ల : స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 21న అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని తొమ్మిది కంపెనీల ప్రతినిధులు హాజరై అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేస్తారని పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో వివిధ ట్రేడ్‌లలో శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులు మూడు బయోడేటాలతొ పాటు విద్యార్హత పత్రాలతో హాజరుకావాలని కోరారు. శ్యాంక్రంగ్ పిస్టన్స్, నాగార్జున అగ్రికమ్, దీపక్‌మైనీ, సొల్యూషన్, జయభేరి తదితర కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు.
భార్యను వేధించిన భర్తకు జైలుశిక్ష
కాశీబుగ్గ : భార్యను వేధించిన కేసులో భర్తకు మూడు నెలల జైలుశిక్ష విధిస్తూ పలాస మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి యు.మాధురి తీర్పునిచ్చారు. పలాస మండలం వీరభద్రాపురం గ్రామానికి చెందిన గుంట స్వాతి తన భర్త విశ్వేశ్వరరావు వేధిస్తున్నాడంటూ 2018లో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పటి సీఐ కె.అశోక్‌కుమార్ కేసు నమోదు చేయగా, గురువారం న్యాయమూర్తి తుది తీర్పును వెలువరించారు. ముద్దాయికి మూడు నెలల జైలు శిక్ష, రూ. 3వేల అపరాధ రుసుం విధించినట్లు కాశీబుగ్గ సీఐ జి.రామకృష్ణ తెలిపారు.
రేపు జాబ్‌మేళా
రణస్థలం: కౌశలం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 19న జిల్లా పరిషత్ నూతన సమావేశ మందిరంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు రణస్థలం ఎంపీడీవో ఎం.ఈశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8.30 గంటలకు నియామక ప్రక్రియ ప్రారంభమౌతుందని పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లమో, బీటెక్ మెకానికల్ విద్యార్హతలతో 18 నుంచి 32 ఏళ్ల పురుష అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు.


