శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ బాలురు జూనియర్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఒకేషనల్ ఎం అండ్ ఏటీ గ్రూపు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టు కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పి.సౌజన్య తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. బీటెక్ రెగ్యులర్ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత కలిగి బీటెక్ మెకానికల్, ఆటోమొబైల్ చేసిన వారు అర్హులని స్పష్టంచేశారు. ఆసక్తి గల అభ్యర్థులు రెండు సెట్ల ధ్రువపత్రాలతో ఈ నెల 19, 21వ తేదీలలో శ్రీకాకుళం ప్రభుత్వ బాలురు జూనియర్ కళాశాలలో సంప్రదించాలని కోరారు.
ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తం
జి.సిగడాం: మండలంలోని సీతంపేట పంచాయతీ నక్కపేటలో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తంగా మారింది. హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం తహసీల్దార్ మహాదేవు సరిత, ఎంపీడీఓ గుంటముక్కల రామకృష్ణారావు, ఎస్‌ఐ కొండపల్లి అప్పలసూరి, సిబ్బందితో గ్రామానికి చేరుకుని ఆక్రమణులను తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో గ్రామస్తులంతా చేరుకుని తామంతా పేదలమని, సెంటు భూమి కూడా లేదని, ఎన్నో ఏళ్లగా చెరువు గట్టుపై పాకలు వేసి నివాసం ఉంటున్నామని, ఇప్పుడు తొలగిస్తే తమ గతి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. రాజికీయ కక్షలతో తమ పాకలను తొలగించడం భావ్యం కాదన్నారు. దీనిపై అధికారులు స్పందించి హైకోర్టు ఆదేశాల మేరకే ప్రభుత్వం భూముల్లో ఉన్న ఆక్రమణలు తొలగిస్తున్నామని, స్వచ్ఛందంగా తొలిగిస్తే సరే అని, లేనిపక్షంలో రెండు రోజుల్లో పోలీసు బందోబస్తుతో వచ్చి ఆక్రమణలు తొలగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చామని, ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలన్నారు.


