వినోదం కారాదు విషాదం | - | Sakshi
Sakshi News home page

వినోదం కారాదు విషాదం

Sep 17 2026 12:50 AM | Updated on Sep 17 2026 12:50 AM

● వినాయక నిమజ్జనాల్లో జాగ్రత్తలు

తప్పనిసరి

● హెచ్చరికలు పెడచెవిన పెడితే అనర్థాలే

●ఇసుక తవ్వకాలు జరిగే చోట్ల అప్రమత్తం

● భద్రతా చర్యలకు

ప్రాధాన్యమివ్వాలంటున్న పోలీసులు

శ్రీకాకుళం/శ్రీకాకుళం క్రైమ్‌ : వినాయక నిమజ్జనం ఎంత సందడిగా ఉంటుందో..ఏమాత్రం అజాగ్రత్త వహించినా అంతే విషాదం మిగుల్చుతుంది. పోలీసుల సూచనలు, హెచ్చరికలను పాటించకుండా పెడచెవిన పెడితే కోరి ప్రమాదాలను కొనితెచ్చుకున్నట్లే. తాజాగా బుధవారం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పెదకంచెర్లలో జరిగిన వినాయక విగ్రహ నిమజ్జనంలో ఆరుగురు చిన్నారులు మృత్యువాత పడటం విచారకరం. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రాథమికంగా అక్కడ గుర్తించారు. వినాయక ఉత్సవ కమిటీలు ఉత్సవాలను ఎంత ఘనంగా చేయాలనుకుంటున్నారో.. అంతకు రెట్టింపు ప్రజల భద్రతపై కూడా ప్రాధాన్యతనివ్వాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సూచనలు పాటించాల్సిందే..

జిల్లాలో దాదాపు 4 వేలకు పైగా వినాయక మండపాలు పెట్టినట్లు అంచనా. ఇప్పటికే చాలా చోట్ల నిమజ్జనాలు నదులు, వాగులు, గెడ్డలు, చెరువుల్లో మొదలయ్యాయి. యువత, మహిళలతో పాటు వృద్ధులు, చిన్నారులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.

● సాధ్యమైనంత వరకు వృద్ధులు, చిన్నారులను రాకుండా నియంత్రించాలి. నదుల్లో చాలా చోట్ల ఇసుక తవ్వకాలు జరగడంతో గుమ్మి ప్రాంతాలు ఒడ్డుకు సమీపంలోనే అధికంగా ఉంటున్నాయి. అవి గమనించకపోతే నదిలో మునిగే ప్రమాదముంది.

● సూర్యాస్తమయానికి ముందే నిమజ్జనం చేస్తే మంచిది. రాత్రివేళ నిమజ్జనం చేయడం వల్ల వెలుతురు సరిగా లేక ప్రమాదాలు జరిగే అవకాశముంది.

● భారీ విగ్రహాలను తరలించేటప్పుడు, వాహనాలపై ఎక్కించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. విశాఖలో విగ్రహాన్ని తరలించే క్రమంలో అది పడిపోవడంతో ముగ్గురు యువకులు కింద ఉండిపోవడం, తక్షణమే మిగతా యువకులు అప్రమత్తమవ్వడంతో గాయాలతో బయటపడ్డారు.

● మండపాల వద్ద విద్యుద్దీపాలంకరణ వైర్లు పట్ల అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు పడేటప్పుడు మరింత జాగ్రత్త అవసరం. రెండేళ్ల క్రితం శ్రీకాకుళం హడ్కో కాలనీలో 8 ఏళ్ల బాలుడు విద్యుదాఘాతంతో మృతిచెందాడు.

● ఊరేగింపు సమయంలో డీజేలను వినియోగించడం వల్ల హృద్రోగులు, బాలింతలు, గర్భిణులు, వృద్ధులు, పసిపిల్లలకు చాలా ప్రమాదం. ఇప్పటికే జిల్లా పోలీసు యంత్రాంగం కఠిన నిబంధనలతో పాటు డీజేలను నిషేధించింది.

నదులు, చెరువుల్లో నిమజ్జనాలకు ఆంక్షలు

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వంశధార కుడి, ఎడమ ప్రధాన కాలువల్లో గణేష్‌ విగ్రహాలను నిమజ్జనం చేయవద్దని బీఆర్‌ఆర్‌ వంశధార పర్యవేక్షక ఇంజనీర్‌ రామచంద్రరావు కోరా రు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, పర్యావరణహితంగా నిర్వహించుకోవాలే తప్ప నదీజలాలు, చెరువులు కలుషితమయ్యేలా చేయకూడదన్నారు. విగ్రహాలతో పాటు పూలమాలలు, పూజా సామగ్రి, అలంకరణ వస్తువులు, ప్లాస్టిక్‌ కవర్లు తదితర వ్యర్థాలు కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో చేరుతున్నాయని తెలిపారు. ఈ వ్యర్థాలు కాలువలపై ఏర్పాటు చేసిన ట్రాష్‌ ర్యాక్‌లు వద్ద పేరుకుపోవడం వల్ల నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోందన్నారు. నీటి నియంత్రణ, నియంత్రణా గేట్ల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో నీటిని విడుదల చేయడం, నియంత్రించడం కష్టతరమవుతోందని పేర్కొన్నారు. దీంతో కాలువలపై ఆధారపడే రైతులకు, ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. గణేష్‌ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు అర్ధం చేసుకుని సహకరించాలని కోరారు.

భద్రతకు ప్రాధాన్యమివ్వాలి..

నిమజ్జన సమయంలో చిన్నారులు నీరు ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. కమిటీ సభ్యులు కూడా గమనించాలి. మద్యం సేవించి డ్యాన్సు, హంగామాల పేరుతో అల్లర్లు సృష్టించోద్దు.

– సీహెచ్‌ వివేకానంద, డీఎస్పీ

డీజేలు పెడితే కేసు

డీజేలు, ఇతర సౌండ్‌ బాక్సులు అత్యధిక ధ్వనితో పెట్టి ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది పెడితే కేసులు కట్టి వాటిని సీజ్‌ చేస్తాం. పోలీసుల పరంగా ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. డీజేలు పెడితే రూ. 10 వేల నుంచి రూ. 5 లక్షల వరకు జరిమానా తప్పదు.

– పి.ఈశ్వరరావు, రెండో పట్టణ సీఐ, శ్రీకాకుళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement