● జిల్లాలో ఇంకా కనిపిస్తున్న
బాల్య వివాహాలు
● ఏజెన్సీలోనే అధికం
● తల్లిదండ్రుల నిరక్షరాస్యతే కారణం
చట్టరీత్యా నేరం
బాల్య వివాహాలు చట్టపరంగా నేరం. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిపిస్తే ఫిర్యాదు చేయాలి. ఎలాంటి భయం అవసరం లేదు. స్థానిక పోలీసుల రక్షణలోనే విచారణ జరుగుతుంది. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం. వారి సమ్మతితోనే వివాహాన్ని నిలుపుదల చేయిస్తాం. బాల్యం వివాహాలతో అనారోగ్య సమాజం ఖాయం. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి.
– బి.ఉమాజానకి, పీఓ, ఐసీడీఎస్ కొత్తూరు
హిరమండలం: కొండ కోనల్లో బాల్యం మూడు‘ముళ్ల’ బాటన పడుతోంది. తెలిసీ తెలియని వయసులో వారి మెడలో పసుపు తాళ్లు పడుతున్నాయి. చదువు, ఆటపాటలతో హాయిగా గడవాల్సిన సమయంలో ఏకంగా గర్భం దాల్చుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న అమాయక బాలలు ఇంకా మన ఏజెన్సీలో కనిపిస్తున్నారు. అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు, కట్టుబాట్లతో పెద్దలే చిన్నారులకు పెళ్లి చేసి అత్తారింటికి పంపుతున్నారు.
జల్లాలో ప్రధానంగా వలసలు వెళ్లే పాతపట్నం, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. జిల్లాలో 11 తీర ప్రాంతాల్లో సైతం బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపుగా గిరిజన ప్రాంతాల్లో బాల్య వివాహాలు అనేవి ఒక సంప్రదాయంగా వస్తున్నాయి. అక్కడ కులం కట్టుబాట్లతో ఎక్కువగా చిన్ననాడే పెళ్లిళ్లు జరిపిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదీ పరిస్థితి..
2020–21లో 114, 2021–22లో 68, 2022–23లో 105, 2023–24లో 93, 2024–25లో 57, 2025–26లో 64 బాల్య వివాహాలను అడ్డుకుంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో వలసలు వెళ్లే దంపతులు ఆడపిల్లను అత్తారింటికి పంపేందుకు తొందర పడుతున్నారు.
ఫిర్యాదు చేయవచ్చు
బాల్య వివాహాలు జరిగితే నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు. 1098, 100, 181 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు. సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు సైతం సమాచారం అందించవచ్చు. కేంద్ర ప్రభుత్వం బాల్య వివాహాల నియంత్రణకు ‘బాల్య్ వివాహ్ ముక్త్ భారత్’ కార్యక్రమం చేపట్టింది. బాల్య వివాహాల విషయంలో ఇటీవల ఫేక్ ఫిర్యాదులు చేస్తుండడం కూడా ఆందోళన కలిగిస్తోంది. ప్రేమ వ్యవహారాల కారణంగా కొంతమంది తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే నిజంగా బాల్య వివాహం జరుపుతుంటే మాత్రం నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు.
3వ స్థానంలో
రాష్ట్రంలో 45 శాతానికి మించి బాల్య వివాహాలు జరుగుతున్న జిల్లాల్లో శ్రీకాకుళం మూడోస్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అందులో 23 శాతం మంది 15 నుంచి 18 ఏళ్లలోపు బాలికలే అమ్మలుగా మారుతున్నారు. ఈ పరిస్థితుల్లో బిడ్డ గర్భంలో చనిపోవడం, వైకల్యంతో పుట్టడం వంటి సమస్యలు వస్తాయి.


