సోంపేట: కాశీబుగ్గ డివిజన్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను సోంపేట పోలీసులు అరెస్టు చేశారు. సోంపేట సర్కిల్ పోలీస్‌స్టేషన్‌లో కాశీబుగ్గ డీఎస్పీ టి.భవానీ, సోంపేట సీఐ బి.మంగరాజు, ఎస్‌ఐ బి.మోహినితో కలిసి విలేకరుల సమావేశం మంగళవారం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం బరంపురంనకు చెందిన సత్యప్రదాన్, అమిత్ సాహు అనే ఇద్దరు యువకులు స్నేహితులు. పదో తరగతి వరకు చదువుకున్న సత్య ప్రదాన్ వలస కార్మికుడిగా చైన్నెలో కొంతకాలం విధులు నిర్వహించాడు. అనంతరం బరంపురం ప్రభుత్వ ఆస్పత్రిలో క్యాంటిన్ నడుపుతూ జీవనం సాగించాడు. ఇతను జూదం, ఆన్‌లైన్ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగులకు బానిసయ్యాడు. వచ్చిన ఆదాయం సరిపోవకపోవడంతో దొంగతనాలు చేయడం వృత్తిగా భావించి ద్విచక్ర వాహనాల దొంగతనానికి అలవాటుపడ్డాడు. అదే ప్రాంతానికి చెందిన అమిత్ సాహుతో సత్యప్రదాన్‌కు పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరూ కలిసి కాశీబుగ్గ డివిజన్ పరిధిలో సుమారు 17 ద్విచక్ర వాహనాలు దొంగతనం చేశారు. సోంపేట పట్టణంలో చార్జింగ్ బండిపై బైక్ దొంగతనం చేయడానికి వస్తున్నారు. సోంపేట పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండడం చూసి వీరిద్దరు తప్పించుకోవడానికి ప్రయత్నించారు. అనుమానం వచ్చిన సోంపేట ఎస్‌ఐ బి.మోహిని వీరిఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించి వీరి వద్దనుంచి 14 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. సమావేశంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
మాట్లాడుతున్న డీఎస్పీ భవానీ


