● తుంగతంపర గ్రామస్తుల ఆందోళన
హిరమండలం: తమ గ్రామంలో రాజుల చెరువును కాపాడాలని కోరుతూ తుంగతంపర గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. పర్లాకిమిడి గజపతిరాజుల నుంచి 77 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు జవ్వాజి శ్రీరామమూర్తి చెబుతున్నారు. ఆ భూమికి సంబంధించి పట్టాదారు పాసు పుస్తకాల కోసం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దశాబ్దాలుగా గ్రామ అవసరాలకు వినియోగించుకుంటున్న చెరువును అక్రమ మార్గంలో కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామ అవసరాలకు ఉపయోగిస్తున్న చెరువును అక్రమ మార్గంలో స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమకు అన్యాయం చేయాలని చూస్తే మాత్రం ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దశాబ్దాల కిందట నాటి భూమికి ఇప్పటి రికార్డులు చూపించి స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాన్ని ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.


