కవిటి: రాజపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సుమారు 20 ఏళ్లపాటు గణిత ఉపాధ్యాయునిగా పనిచేసి ఆత్మీయ గురువుగా పేరుగాంచిన బలివాడ లక్ష్మణరావు ఇటీవల అనారోగ్యానికి గురై మళ్లీకోలుకున్నారు. తాను చదువు చెప్పిన శిష్యులను అందరినీ చూడాలని ఉందంటూ మనసులో కోరికను బయటపెట్టడంతో గురువారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. సుమారు వెయ్యి మంది శిష్యులు హాజరై గురువుతో మాట్లాడి ఆశీర్వాదాలు అందుకున్నారు. ఇంతటి మంచి శిష్యులను అందించిన దేవుడికి సర్వదా రుణపడి ఉంటా నని లక్ష్మణరావు మాస్టారు భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా బలివాడ లక్ష్మణరావుతో పాటు పనిచేసిన రావి రాంప్రసాద్, దండాశిరౌళో మాస్టార్లను కూడా శిష్యులు దుశ్శాలువలతో సత్క రించి జ్ఞాపికల్ని అందించారు.


