గార: మండలంలోని వత్సవలస పంచాయతీ పేర్లవానిపేట గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ అభిమాని చీకటి శ్రీరాములు ఇంటిపై టీడీపీ వర్గీయులు మంగళవారం దాడి చేశారు. అనంతరం బాధితుడైన శ్రీరాములుపైనే కేసు నమోదు చేయాలని టీడీపీ నాయకులు పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చీకటి శ్రీరాములు సొంత స్థలం పక్కన ఖాళీ స్థలంలో పేర్ల ఎర్రమ్మ కుటుంబ సభ్యులు నిర్మాణం చేపడుతుండంతో వాటిని ఆపేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో వివాదం జరుగుతున్న సమయంలో బందరువానిపేటకు చెందిన పుక్కళ్ల లక్ష్మణరావు తదితర కొంతమంది శ్రీరాములు ఇంటిపై దాడి చేశారు. ప్రహరీ దూకి వచ్చి కిటికీని పగలగొట్టడంతో పాటు మరుగుదొడ్డి తలుపును బద్దలుగొట్టారు. ఇంట్లో ఉన్న అతని కోడలు ధనలక్ష్మి బయటకు వచ్చి చెప్పడంతో వాళ్లంతా పారిపోయారు. దీనిపై గార పోలీసులకు ఫిర్యాదు చేస్తే బాధితుడైన శ్రీరాములుపైనే కేసు నమోదు చేయాలని టీడీపీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా తీసుకునేందుకు చాలా సమయం తీసుకున్నారని, ఇంతవరకు కేసు రిసిప్ట్ కూడా ఇవ్వలేదని బాధితుడు శ్రీరాములు తెలిపాడు. విషయం తెలుసుకున్న ఎంపీపీ గొండు రఘురామ్, జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి, కొయ్యాన నాగభూషణం, అప్పారావు, చిట్టిబాబు తదితరులు పేర్లవానిపేట వెళ్లి పరామర్శించారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


