శ్రీకాకుళం పాతబస్టాండ్:
జిల్లాలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలల సమస్యలు, దళితుల భూ సమస్యలు, దళిత కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా దళిత ప్రజాసంఘాల జేఏసీ నాయకులు కోరారు. ఈ మేరకు జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌కు ఆయన కార్యాలయంలో వినతిపత్రం బుధవారం అందజేశారు. గతంలో పలుమార్లు జిల్లా అధికారుల దృష్టికి సమస్యలను తీసుకొచ్చినప్పటికీ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో మెరుగైన ఫలితాల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన మెనూ అందించాలని, బోధన, బోధనేతర సిబ్బంది కొరతను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పాతపట్నం అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాలలో మృతి చెందిన విద్యార్థిని చింతల పూజ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి రూ.15 లక్షల ఆర్థిక సాయం అందించాలని కోరారు. పరిపాలనా వైఫల్యాలకు బాధ్యులైన డీసీవో యశోద లక్ష్మీపై చర్యలు తీసుకుని, ఆమె డిప్యూటేషన్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మరికొన్ని సమస్యలు ఈనెల 20లోపు పరిష్కరించాలని, లేకుంటే దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ పేడాడ కృష్ణారావు, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, దళిత సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ దుర్గాసి గణేష్ పాల్గొన్నారు.


