ఉపాధి కోసం వెళ్తూ.. మృత్యు ఒడిలోకి... | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కోసం వెళ్తూ.. మృత్యు ఒడిలోకి...

Aug 27 2026 1:30 AM | Updated on Aug 27 2026 1:30 AM

కంచిలి: సోంపేట రైల్వేస్టేషన్‌లో విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కుతుండగా జారిపడి వ్యక్తి దుర్మరణం చెందాడు. కవిటి మండలం బల్లిపుట్టుగ గ్రామానికి చెందిన తోట వెంకటరావు(47) అనే వ్యక్తి విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో భీమవరం వెళ్లేందుకు బుధవారం బయల్దేరాడు. టికెట్‌ తీసి ఒకటో నంబర్‌ ప్లాట్‌ ఫాం మీద ఆగిన రైలును ఎక్కి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రైన్‌ నుంచి జారిపడ్డాడు. ఈ ప్రమాదంలో ఇతని కాలి మీద నుంచి ట్రైన్‌ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తోట వెంకటరావు భీమవరంలోని ఒక హోటల్‌లో వంట మనిషిగా 26 ఏళ్లు నుంచి పని చేస్తున్నాడు. మధ్యలో కొన్నాళ్లు స్వగ్రామంలో చిన్న జనరల్‌ స్టోర్‌ కూడా నడిపాడు. వ్యాపారం లేకపోవడంతో మళ్లీ వంట పనిచేయడానికి భీమవరం వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇతనికి భార్య సుజాత, కుమారుడు మణికంఠ, కుమార్తె మనీష ఉన్నారు. కుమారుడు మణికంఠ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఇండియన్‌ కాఫీ హౌస్‌లో పనిచేస్తుండగా, కుమార్తె మనీష సోంపేటలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇంటి యజమాని అకస్మాత్తుగా ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. మృతుని స్వగ్రామం బల్లిపుట్టుగలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటనపై పలాస జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి సోంపేట ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

40 నిమిషాలు నిలిచిపోయిన ట్రైన్‌

విశాఖ ఎక్స్‌ప్రెస్‌ నుంచి ప్రయాణికుడు జారిపడి మృతి చెందడంతో ట్రైన్‌ను సోంపేట స్టేషన్‌లో 40 నిమిషాలు పాటు నిలిపివేశారు. ప్రమాదం జరిగిందని తెలిసి ప్రయాణికులంతా అవాక్కయ్యారు. ప్రమాదం జరిగిన తర్వాత రైల్వే అధికారులకు స్థానిక స్టేషన్‌ మేనేజ్‌మెంట్‌ సమాచారం ఇవ్వడం, అక్కడి నుంచి మళ్లీ ఆదేశాలు అందిన తర్వాత ట్రైన్‌ను పంపేందుకు సిగ్నల్‌ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement