● దొంగతనాలకు పాల్పడిన డిగ్రీ విద్యార్థి అరెస్టు
● 16.25 తులాల బంగారం, రూ.39 వేలు నగదు స్వాధీనం
ఇచ్ఛాపురం రూరల్: బెట్టింగులకు బానిసైన ఓ డిగ్రీ విద్యార్థి డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడుతూ చివరకు పోలీసులకు చిక్కాడు. ఇప్పటికే బారువ పోలీస్ స్టేషన్ పరిధిలో అతనిపై ఏడు కేసులు నమోదయ్యాయి. ఇచ్ఛాపురం మండలం డొంకూరు మత్స్యకార గ్రామంలో జరిగిన చోరీ కేసు దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. ఈ కేసు వివరాలను కాశీబుగ్గ డీఎస్పీ టీ.భవానీ మంగళవారం సీఐ ఎం.చిన్నంనాయుడు, రూరల్ ఎస్సై ఆర్.జనార్దనరావుతో కలిసి విలేకరులకు వివరాలు వెల్లడించారు.
చోరీ సొమ్ము అమ్మేందుకు సిద్ధమై..
డొంకూరు గ్రామంలో ఇటీవల రూ.24 వేల నగదు, బంగారు కాసు చోరీకి గురైనట్లు బాధితులు ఇచ్ఛాపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమేరాల ఫుటేజీలను పరిశీలించగా సోంపేట మండలం ఇసుకలపాలెం గ్రామానికి చెందిన వాసుపల్లి తాతారావు అనే డిగ్రీ విద్యార్థి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. తదుపరి దర్యాప్తులో అతనిపై గతంలోనే ఇచ్ఛాపురం రూరల్, కవిటి, బారువ పోలీస్ స్టేషన్‌లలో ఏడు కేసులు నమోదైనట్లు వెలుగులోకి వచ్చింది. దొంగతనం ద్వారా సంపాదించిన సొత్తును ఒడిశాలోని బరంపురంలో విక్రయించేందుకు విద్యార్థి సిద్ధమయ్యాడు. మంగళవారం ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి జంక్షన్ వద్ద బస్సు కోసం వేచి ఊండగా, రూరల్ ఎస్‌ఐ ఆర్.జనార్థనరావు తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 16 తులాల పావు బంగారం, రూ.39 వేలు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బెట్టింగులే కారణం..
బారువలో డిగ్రీ చదువుతున్న తాతారావు బెట్టింగులకు బానిసై డబ్బులు అవసరం కావడంతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు. యువత ఆన్‌లైన్ బెట్టింగులు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని సీఐ తెలిపారు.


