గణపతి విగ్రహాలకు
మెరుగులు
జగన్నాథుని ఆకృతిలో వినాయకుడు
మందస
వినాయక చవితి సందడి మరో 20 రోజుల్లో మొదలుకానుంది. భాద్రపద శుక్లపక్ష చవితినాడు ప్రారంభమైన నవరాత్రుల్లో ఎంతో అంగరంగ వైభవంగా హిందువులు మొదటి ఉత్సవంగా ఈ పండగను భావిస్తారు. ఈ క్రమంలో గణనాథుని విగ్రహాలకు కళాకారులు తుదిమెరుగులు దిద్దుతున్నారు. వీటినే నమ్ముకొని వేలాది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. ఏటా ఓసారి వచ్చే వినాయక చవితి ఉత్సవాల్లో అవసరమైన బొజ్జ గణపయ్య విగ్రహాలను విభిన్న ఆకృతుల్లో తయారుచేసి అమ్మకాలను సాగిస్తారు. ప్రధానంగా మందస కేంద్రంలో తయారు చేస్తున్న మట్టి విగ్రహాలకు మందస, హరిపురం, పలాస, గొప్పిలి, తర్లాకోట, రాజపురం, సారంగిపురం, ఒడిశా తదితర ప్రాంతాల్లో గిరాకీ ఉంటుంది. ఉత్సవాలకు మూడు నెలలు ముందే విగ్రహాలు తయారీకి అవసరమైన ముడి సామగ్రిని లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి గణపతి విగ్రహాలను కళాకారులు ప్రారంభిస్తారు. ఇక్కడ అధిక సంఖ్యలో మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తారు.
విభిన్న ఆకృతులు..
ఏటా విభిన్న ఆకృతిలో వినాయకులను తయారుచేస్తుండటంతో ఆదరణ పెరుగుతోంది. స్థానిక కమిటీ సభ్యుల అభిరుచులు, ఆలోచనలకు తగ్గట్టుగా రకరకాల ఆకృతిలో వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. నాలుగు అడుగుల నుంచి 12 అడుగులు ఎత్తు వరకు తయారు చేసి మార్కెట్లో అమ్మకాల కోసం సిద్ధం చేస్తున్నారు. సైజును బట్టి ఒక్కొక్క విగ్రహాన్ని రూ.4,000 నుంచి రూ.25 వేల వరకు అమ్మకాలు చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో విగ్రహాల అమ్ముడుపోతేనే తమ కుటుంబ పోషణకు భరోసా దొరుకుతుందని, లేదంటే నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కళాకారులు చెబుతున్నారు.
మట్టి విగ్రహాల తయారీనే నమ్ముకున్న కళాకారులు
స్థానికులతో పాటు ఒడిశా ప్రాంతాల నుంచి రాక
కమిటీ సభ్యుల అభిరుచులకు తగ్గట్టు విగ్రహాల రూపకల్పన


