అరసవల్లి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులకు వర్షం ఇక్కట్లు తప్పడం లేదు. శ్రావణ ఆదివారం సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు స్థానిక పరిస్థితులు సౌకర్యాలు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించాయి. దర్శనాల వరకు ఏర్పాట్లు బాగానే ఉన్నప్పటికీ తర్వాత పరిస్థితులు మాత్రం ఇబ్బందులకు గురిచేస్తున్నాయని భక్తులు వాపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో లక్షలాది రూపాయలు వెచ్చించి భక్తదాతలు చేయించి ఏర్పాటు చేసిన జింకు రేకుల షెడ్లును కూల్చేసి కమ్మరేకుల శాలను వేయించిన ప్రస్తుత పాలకుల తీరుపై పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత వర్షాలకు పూర్తిగా తడిచి ముద్దయి వర్షపునీరుతో ఉండడంతో ఎప్పటికప్పుడు సిబ్బంది నీటిని తొలిగించే చర్యలు చేపడుతున్నప్పటికీ..భక్తులకు మాత్రం అవస్థలు తప్పడం లేదు. ప్రసాదాల విభాగం కూడా ఇక్కడే ఉండడంతో కొనుగోలుతో పాటు తినడానికి కూడా భక్తులు అవస్థలు పడ్డారు. వర్షపునీటిలో బయటకు వెళ్లలేక..ఈ కమ్మ రేకుల శాలలో కూర్చోలేక నిలబడే ప్రసాదాలను తినడం కనిపించింది. ఇప్పటికై నా ఆలయ అధికారులు శాశ్వత ఏర్పాట్లపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.


