సీబీఐ విచారణ కోరితే భయమెందుకు? | - | Sakshi
Sakshi News home page

సీబీఐ విచారణ కోరితే భయమెందుకు?

Aug 23 2026 12:34 AM | Updated on Aug 23 2026 12:34 AM

సీబీఐ విచారణ కోరితే భయమెందుకు? ● ఎమ్మెల్సీ నర్తు రామారావు

కవిటి: డీఎస్సీ–2025 నిర్వహణలో చోటుచేసుకున్న ఆరోపణలు, అవకతవకలపై ప్రతిపక్షం సీబీఐ విచారణకు పట్టుబడతారనే భయంతో పాలకులు సభ నుంచి పారిపోవడం అభ్యంతరకరమని ఎమ్మెల్సీ సభ్యులు నర్తు రామారావు అన్నారు. శనివారం కొత్తపుట్టుగలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. నాలుగు రోజులు పాటు జరిగిన శాసన మండలి వర్షాకాల సమావేశాలు ఎటువంటి ఫలవంతమైన చర్చలకు అవకాశం లేకుండా ముగిసిపోవడం దురదృష్టకరమన్నారు. డీఎస్సీపై చర్చకు ప్రభుత్వాన్ని కోరితే కప్పదాటు ధోరణి అవలంబించిందన్నారు. ఒకవేళ నిష్పాక్షికంగా డీఎస్సీ నిర్వహిస్తే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ఈ సమావేశాల ద్వారా నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొద్దామంటే.. సభను సజావుగా నిర్వహించలేదన్నారు. ఇచ్ఛాపురం పట్టణానికి ప్రవేశవంతెన కూలిపోయి మూడేళ్లు గడిచిందని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వంతెన నిర్మాణానికి రూ.20కోట్ల నిధులు మంజూరు చేసిన జీవోను కూటమి ప్రభుత్వం రద్దు చేయడం దురదృష్టకరమన్నారు. మూడుసార్లు టీడీపీ ఎమ్మెల్యేను గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన బహుమానం ఇదేనని ఎద్దేవా చేశారు. కిడ్నీ బాధిత ఉద్దాన ప్రాంతాన్ని మెడికల్‌ ఎమర్జెన్సీగా గుర్తించాలన్నారు. దామోదరపురం గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించడంలో టీడీపీ ఎమ్మెల్యేలు విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఈ క్రమంలో ఓ గర్భిణి తన బిడ్డను కోల్పోయిందన్నారు. ఇచ్ఛాపురం నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రానికి ఎల్లో బోర్డు వాహనాలు ఫిట్నెస్‌ పరీక్షకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఈ క్రమంలో ఏవైనా ప్రమాదాలు జరిగితే ఎవరు ఆదుకుంటారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ కడియాల ప్రకాష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement