ఇచ్ఛాపురం రూరల్: ఒకే ఉద్యోగం చేస్తున్న తమపై పలు కీలక బాధ్యతలు మోపడంతో తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నామని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్ఛాపురం మండలం మండపల్లి గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న రౌతు మెహర్ శుక్రవారం బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ శనివారం నియోజకవర్గ స్థాయి సచివాలయ ఉద్యోగులు నిరసన చేపట్టారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇచ్ఛాపురం తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల ముందు ఆందోళన నిర్వహించి సంబంధిత అధికారులకు వినత పత్రాలు అందజేశారు.
విపరీతమైన ఒత్తిడి
మృతుడు మెహర్ ఒక్కరిపైనే డిజిటల్ అసిస్టెంట్ విధులతో పాటు బూత్ లెవల్ ఆఫీసర్, మండల సెన్సస్ కో ఆర్డినేటర్, ఆధార్ ఆపరేటర్ వంటి కీలక బాధ్యతలు అప్పగించారని ఉద్యోగులు తెలిపారు. వీటికి తోడు రోజు వారీ సర్వీసులు, వివిధ ప్రభుత్వ సర్వేలు నిర్వహించాల్సి రావడంతో పని భారం విపరీతంగా పెరిగిందన్నారు. నిర్ణీత సమయంలో పలు రకాల విధులు పూర్తి చేయాలన్న ఒత్తిడితో ఉద్యోగులు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దీనిపై ఎన్నోసార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని వారు తెలిపారు. ఉద్యోగి మెహర్ కుటుంబం పెద్ద దిక్కును కోల్పయిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర గ్రామ, వార్డు సచివాలయ సంఘం జేఏసీ కో ఆర్డినేటర్ కూన వెంకట సత్యన్నారాయణ, ఏఎస్‌ఈ స్టేట్ వైస్ ప్రసిడెంట్ షేక్ ఫరూక్, జేఏసీ జిల్లా కో ఆర్డినేటర్లు ఉప్పాడ జైకృష్ణ. పొల్లాయి అశోక్, విజయకుమారీ, ప్రదీప్, అబ్ధుల్, సర్వేశ్వరరావు, కొప్పల రవిబాబు, వాసుదేవ్, సూర్యకుమారీ, సునీల్ గఫూర్, ప్రవీణ్, మీనాక్షి, కె.నీరజ తదితరులు పాల్గొన్నారు.


