● ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ(సర్)పై అనుమానాలు
● ముసాయిదాలో మరణించిన వారి పేర్లు
● సక్రమంగా జరగలేదనడానికి నిదర్శనాలెన్నో..
పరిశీలించారా..?
వాస్తవంగా 85 ఏళ్లు దాటిన వారి జాబితాను ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా పంపించింది. వాటిని ప్రత్యేకంగా పరిశీలించి బతికున్న వారెవరు, మరణించిన వారెవరు అన్నది గుర్తించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. 35 వేల వరకు ఆ జాబితాలో ఉన్నారు. వాటిన్నింటినీ బీఎల్‌ఓ వారీగా విభజన చేసి, వారికిచ్చి, 85 ఏళ్లు ఉన్న వారి ఇళ్లకు నేరుగా వెళ్లి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలి. కానీ, ఆ ఆదేశాల మేరకు సవరణ ప్రక్రియ జరగలేదని తాజాగా బయటపడుతున్న విచిత్రాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఎమ్మెల్సీలుగా చేశారంటే వారంతా ప్రముఖులే. అలాంటి ప్రముఖులనే గుర్తించలేకపోయారంటే సామాన్యుల పరిస్థితేంటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) జిల్లాలో సక్రమంగా జరగలేదనడానికి నిదర్శనాలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఉదాహరణల్లో పేర్కొన్న వ్యక్తులు ఎక్కడో శివారు ప్రాంతాలకు చెందిన వారు కారు. సాక్షాత్తూ జిల్లా కేంద్రానికి చెందిన వారు. మరణించిన వారిని బతికున్నట్టుగా ఎలా చూపించారో జిల్లా కలెక్టర్‌కు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియలో విధులు నిర్వర్తించిన అధికారులు, ఉద్యోగులకే తెలియాలి. ఇలాంటి ‘సర్’ప్రైజులు ఎన్నో ఈ జాబితాలో ఉన్నాయి.
అడుగడుగునా అనుమానాలే..
జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ తప్పుల తడకగా జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ దగ్గరి నుంచి తీసుకున్న ప్రక్రియ సక్రమంగా జరగలేదని తొలి నుంచి వినిపించింది. ఇప్పుడా చిత్ర విచిత్రాలు, లోపాలు బయటపడుతున్నాయి. నాటి ఆరోపణలకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. డొల్లతనం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది.. మరణించిన వారు బతికున్నట్టుగా ముసాయిదాలో ఓట్లు చూ పించడం మరింత చర్చనీయాంశంగా మారింది. వాస్తవంగా మొదటి డెడ్‌లైన్‌లోపు సవరణ ప్రక్రియ పూర్తిగా జరగలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల సంఘం ఆ డెడ్‌లైన్ పొడిగించడంతో జిల్లా అధికారులు బతికి పోయారు. ఈ పొడిగింపు సమయంలో అప్పటికి ఎన్నైతే మిగిలాయో వాటిన్నింటిని టపాటపా కొట్టేశారన్న వాదనలు ఉన్నాయి. లేదంటే మరింత డొల్లతనం బయటపడేది. గడువులో ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయలేదని చాలా చోట్ల వినిపించింది. కొన్నిచోట్లైతే ఓటర్లకు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి తీసుకోలేదనే వాదనలు ఉన్నాయి. మొత్తం పెంచిన గడువులో మమ అనిపించేశారు. ఇప్పుడా సవరణలో లోపాలు బయటపడుతున్నాయి. ఎవరైనా గుర్తించి, అభ్యంతరం వ్యక్తం చేస్తేనే.. లేదంటే మరణించిన వారి ఓట్లు బతికున్నట్టుగానే కొనసాగిపోనున్నాయి.


