చెత్త నుంచి సంపద..
పరిశీలించాం..
ఇటీవలే ఇన్‌చార్జి ఈఓగా బాధ్యతలు స్వీకరించాను. రెండు రోజుల క్రితం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించాను. ఉన్నతాధికారుల సూచనలతో తగిన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తాను. – జగన్మోహనరావు, ఇన్‌చార్జి ఈఓ
నరసన్నపేట :
కూటమి ప్రభుత్వంలో సంపద సృష్టి అనేది అంతా బూటకమేనని నరసన్నపేటలోని ‘చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని’ చూస్తే అర్ధమవుతుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ కేంద్రాన్ని ఈ ఏడాది మే నెలలో మరోసారి ముస్తాబు చేశారు. రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్రాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు రీ సైక్లింగ్ చేస్తున్నామని, గ్రామాల్లో నిత్యావసర సరుకులు విక్రయించి సేకరించిన చెత్తను ఇక్కడకు తీసుకొస్తున్నామని సీఎంకు అధికారులు వివరించారు. జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి కొంత మంది నిపుణులను సైతం తీసుకువచ్చి ముఖ్యమంత్రికి సంపద కేంద్రం నిర్వహణ తీరును వివరించారు. ఆహా ఇక్కడ ఏదో జరిగిపోతోందని భావించిన సీఎం అధికారులకు కితాబునిచ్చారు. సీన్ కట్ చేస్తే ఇదంతా కట్టుకథేనని తేలిపోయింది. ముఖ్యమంత్రి వచ్చే వరకూ ఈ కేంద్రం వద్ద రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి అధికారులు హడావిడి సృష్టించారు. ఆయన వెళ్లిన మరుక్షణం నుంచే అంతా షరామామూలుగా మారింది. నెల రోజులు ఇక్కడ పనిచేసిన సత్యవరం గ్రామానికి చెందిన మహిళా సంఘం ప్రతినిధులకు జీతాలు ఇవ్వక పోవడంతో వారు రావడం మానేశారు. ప్రస్తుతం ఈ చెత్త నుంచి సంపద కేంద్రం కుక్కలకు, మందుబాబులకు ఆవాసంగా మారింది.
వృథాగా విలువైన యంత్రాలు..
ప్లాస్టిక్ వ్యర్థాలు రీ సైక్లింగ్ చేసేందుకు అత్యాధునిక విలువైన యంత్రాలను ఇక్కడికి తీసుకొచ్చారు. వీటి ఖరీదు రూ.30 లక్షలని సమాచారం. ఇవి ప్రస్తుతం వృథాగా పడి ఉన్నాయి. వీటికి రక్షణ లేకపోవడంతో దొంగల నుంచి ముప్పు పొంచి ఉంది. సీఎం రాక కోసం 16 వర్మీ కంపోస్టు పిట్లు, మరో 16 నాడెప్ పిట్స్ నిర్మించారు. ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన వర్మీ కంపోస్టును పిట్స్‌లో వేశారు. ఇప్పుడు ఈ కంపోస్టు అంతా ఎందుకూ పనికిరాకుండా పోయింది. అప్పుడు వివిధ పనులు నిర్మాణానికి తీసుకువచ్చిన 60 బస్తాల సిమెంట్ గడ్డకట్టి నిరుపయోగంగా మారింది. ఇలా ప్రజాధనం వృథాకు బాధ్యులు ఎవరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
కుక్కలకు ఆవాసంగా నరసన్నపేట సంపద కేంద్రం
మే 16న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం
మూడు నెలల్లో పైసా
ఆదాయం వస్తే ఒట్టు


