అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో వరుస అపచారాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ పక్కన కలుషిత ఆహారం తిని గోశాలలో ఆవుల మరణాలు, మరో వైపు విధుల్లో ఉన్న మహిళలపై అకృత్యాలు, ఇంకో పక్క హుండీ కానుకల్లో లెక్కింపు సిబ్బంది చోరీకి పాల్పడటం వంటి వరుస ఘటనలు ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తుంటే.. తాజాగా నిత్యాన్నదాన విభాగంలో వినియోగానికి బయటకు తీసి ఉంచిన వంట నూనె, నెయ్యి, పప్పు దినుసులు చోరీకి గురయ్యాయి. బుధవారమే ఈ ఘటన జరిగినప్పటికీ సమాచారం బయటకు రాకుండా ఆలయ సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వంట విధుల్లో ఉన్న ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించి, అన్నదాన, ప్రసాదాల వినియోగానికి సిద్ధం చేసిన పలు పచారీ సరుకులు మాయం చేశాడని తేలింది. దీంతో ఆగమేఘాల మీద ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ రంగంలోకి దిగి, సరుకులపై ఆరా తీసి ఆ ఉద్యోగిపై చర్యలకు ఉపక్రమించారని సమాచారం. నిత్యాన్నదాన ప్రసాదాల వంటకు విధుల్లో ఉన్న సదరు ఉద్యోగి పూటుగా మద్యం సేవించి విధులు నిర్వర్తిస్తున్నట్లుగా కూడా తేలింది.


