వజ్రపుకొత్తూరు రూరల్: సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను పెంచాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వినోద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పలాస ఆర్డీఓ అప్పలరాజకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారని, మూడేళ్లగా ప్రభుత్వాలు మెస్ చార్జీలు పెంచలేదన్నారు. రాష్ట్రంలో మాత్రం నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని విమర్శించారు. పెరిగిన ధరలతో విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం సాధ్యం కాదన్నారు. మెస్ చార్జీలను 49 శాతం వరకు పెంచాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న కాస్మొటిక్ చార్జీలను తక్షణమే విడుదల చేయాలని, గిరిజన పోస్ట్‌మెట్రిక్ హాస్టల్‌లో రెగ్యులర్ వర్కర్లను నియమించాలన్నారు. కార్యక్రమంలో పి.డి.ఎఫ్.యు.నాయకులు విజయ్, దయ, చంటి తదితరులు పాల్గొన్నారు.


