శ్రీకాకుళం క్రైమ్: శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన తప్పుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ పరిశీలకుడు కిల్లి వెంకట సత్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఒక హోటల్‌లో పార్టీ ఇచ్ఛాపురం నియోజకవర్గ పరిశీలకుడు దుంపల రామారావు (లక్ష్మణరావు), పార్టీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్‌తో కలిసి మీడియా సమావేశం బుధవారం నిర్వహించారు. నాలుగున్నర దశాబ్ధాల రాజకీయ చరిత్రలో ఎమ్మెల్యేగా, 15 ఏళ్లు మంత్రిగా పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన బొత్సపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు, అర్హత లేని అభ్యర్థులకు ఉద్యోగాల కల్పన, స్పోర్ట్స్ కోటాలో చోటు చేసుకున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మెంటాడ స్వరూప్ మాట్లాడుతూ అవినీతిని నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఈ కూటమి ప్రభుత్వానికి, వత్తాసు పలుకుతున్న ఎల్లో మీడియాకి కొత్తేమీ కాదన్నారు. దుంపల రామారావు మాట్లాడుతూ విద్య, వైద్యం, సేధ్యం వంటి రంగాలపై చర్చించే దమ్ము కూటమి ప్రభుత్వానికి లేదన్నారు.


