శ్రీకాకుళం పాతబస్టాండ్: విశాఖ డెయిరీ అవినీతిపై వేసిన హౌస్ కమిటీ రిపోర్టు వెంటనే బయట పెట్టాలని పాల రైతులు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పొందూరు చంద్రరావు, వెలమల రమణలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం ఏవోకు వినతిపత్రం బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విశాఖ డెయిరీకి 6 జిల్లాలకు చెందిన 3.5 లక్షల మంది రైతులు రోజుకి 9 లక్షల లీటర్ల పాలు పోస్తున్నారని తెలిపారు. పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నా డెయిరీ యాజమాన్యం స్వార్థ ప్రయోజనాలు కోసం డెయిరీ ఆదాయాన్ని దారి మళ్లిస్తోందని విమర్శించారు. డెయిరీ అవినీతికి కేంద్ర బిందువుగా ఉన్న చైర్మన్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నందున, ఆయనపై చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం వెనకడుగు వేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల ప్రయోజనం కంటే, రాజకీయ ప్రయోజనాలకే మొగ్గు చూపుతోందని ధ్వజమెత్తారు. హౌస్ కమిటీ రిపోర్టు బయటపెట్టి, దాని ఆధారంగా అవినీతిపరులను శిక్షించి, డెయిరీ ఆస్తులు కాపాడాలని, డెయిరీకి వస్తున్న మిగులు ఆదాయం రైతుకు బోనస్ ఇవ్వాలని, లీటరు పాలుకి రూ.10 ల సేకరణ ధర పెంచాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.


