శాసనమండలిలోఉన్మాదత్వాన్ని
ప్రదర్శిస్తున్నారు
విలేకరుల సమావేశంలో పేరాడ
తిలక్ మండిపాటు
టెక్కలి: శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణపై మంత్రి అచ్చెన్నాయుడు ఉన్మాదత్వాన్ని ప్రదర్శించేలా చేసిన వ్యాఖ్యలతో జిల్లా పరువు పోయిందని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ అన్నారు. మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం టెక్కలి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో తిలక్ మాట్లాడారు. పెద్దల సభలో ఏ విధంగా మాట్లాడాలో, సభ్యులను ఏ విధంగా గౌరవించాలో మంత్రికి తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. మనిషి పెరిగినా అజ్ఞానిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మెగా డీఎస్సీలో అక్రమాలు జరగలేదని నిరూపించలేకపోతున్నారని, అందుకే ప్రతిపక్ష నాయకులపై తీవ్రమైన పదజాలంతో దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో కింజరాపు కుటుంబం చేస్తున్న అవినీతి బయట పడకుండా ఉండేందుకు సీఎం చంద్రబాబు వద్ద మెప్పు కోసం ప్రతిపక్ష నేతలపై నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మంత్రి అసమర్థత వల్ల వ్యవసాయం చేయాలంటే రైతులు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా నోటిని అదుపులో పెట్టకపోతే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. డీఎస్సీపై చర్చ జరుగుతుందనే భయంతోనే విద్యా శాఖ మంత్రి లోకేష్ సభకు హాజరు కాలేదన్నారు. సమావేశంలో నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్ముర్తి, సీనియర్ నాయకులు కురమాన బాలకృష్ణ పట్టణ అధ్యక్షుడు తమ్మన్నగారి కిరణ్, ఎంపీటీసీ వాకాడ శ్రీధర్‌రెడ్డి, నాయకులు ఆట్ల రాహుల్, రౌతు జయమోహన్, మార్పు నాగభూషణ్, చింతాడ అప్పన్న తదితరులు పాల్గొన్నారు.


