బొండపల్లి: మండలంలోని నెలివాడ గ్రామంలో రాజు చెరువు వద్ద మంగళవారం వేకువ జామున ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు, బొలెరో వ్యాన్ బలంగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వాహన డ్రైవర్లకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ఎస్సై యు.మహేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన బొలెరో వ్యాన్ డ్రైవర్ మాతా నవీన్ గజపతినగరంలో టమాటోలు దించి మిగతా సరుకును విజయనగరంలో దించేందుకు వెళ్తుండగా విజయనగరం నుంచి గజపతినగరం వైపు వస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లారీ ముందు వెళ్తుండగా ఏపీకి చెందిన లారీ ఓవర్ టేక్ చేసే సమయంలో బొలెరో వ్యాన్‌ను, ఛత్తీస్‌గఢ్ లారిని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ నవీన్‌కు తీవ్ర గాయాలై వాహనంలోనే కుడి కాలు, ఎడమ చేయి పూర్తిగా ఇరుక్కుని చిక్కుకు పోగా పోలీసులు చేరుకుని బాధితుడిని రక్షించి బయటకు తీసి జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉందని, లారీ డ్రైవర్లు స్వల్ప గాయాలుతో బయట పడ్డారని ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.


