ప్రశాంత సిక్కోలులో ఉద్రిక్తతలు పెంచకండి | - | Sakshi
Sakshi News home page

ప్రశాంత సిక్కోలులో ఉద్రిక్తతలు పెంచకండి

Jul 24 2026 2:15 AM | Updated on Jul 24 2026 2:15 AM

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌

నరసన్నపేట: అంబేడ్కర్‌ రాజ్యాంగం పక్కన పెట్టి రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రశాంతంగా ఉన్న సిక్కోలులో ఉద్రిక్తతలు పెంచుతున్నారని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నరసన్నపేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను ఉగ్రవాదుల్లా చూస్తున్నారని పోలీసుల తీరుపై మండి పడ్డారు. అప్పలరాజు అరెస్టు అప్రజాస్వామికమని అన్నారు. అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదాన్ని రాజకీయంగా వాడుకొని ఒక మత్స్యకార కుటుంబానికి, బీసీ వర్గానికి చెందిన అప్పలరాజును గడిచిన వారం రోజులుగా మానసిక క్షోభకు గురి చేస్తున్నారని అన్నారు. జిల్లా ప్రజలు సాగునీరు లేక అలమటిస్తున్నారని, ఎరువులు దొరకడం లేదని, వీటిని పక్కన పెట్టి మంత్రి అచ్చెన్నాయుడు కక్ష సాధింపులకు ప్రాధా న్యత ఇవ్వడం కూటమి పాలనకు అద్దం పడుతోందన్నారు. అంతకుముందు అటు మబగాంలో, ఇటు నరసన్నపేటలోని పార్టీ కార్యాలయం వద్ద నరసన్నపేట, పోలాకి ఎస్‌ఐలు ఆయన ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. కొద్ది సమయం తరువాత కృష్ణదాస్‌తో పాటు పార్టీ నాయకులు అంధవరపు సూరిబాబు, కరిమి రాజేశ్వరరావు, ఎన్ని ధనుంజయ్‌, అంబటి శ్రీనివాస్‌ తదితరులు కార్లలో పలాస వెళ్లారు.

సీదిరి కుటుంబానికి పరామర్శ

టెక్కలి: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడంతో, గురువారం అప్పలరాజును పరామర్శించేందు కు కృష్ణదాస్‌ కాశీబుగ్గ చేరుకున్నారు. అప్పలరాజు భార్య శ్రీదేవి, కుమారుడిని కలిసి మనోధైర్యం కల్పించారు. అయితే స్టేషన్‌ వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement