శ్రీకాకుళం: విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 2,600 ప్రభుత్వ పాఠశాలలు, 40 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ‘మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ (పీటీఎం) నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో తల్లులతో పాటు తండ్రులు కూడా తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. సమావేశాలకు తల్లులే ఎక్కువగా వస్తున్నారని, పిల్లల భవిష్యత్తు, విద్యా ప్రగతిపై దృష్టి సారించేందుకు తండ్రుల భాగస్వామ్యం కూడా ఆవశ్యకమన్నారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి తండ్రికి వ్యక్తిగతంగా ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించాలని ఆదేశించారు.


