జలుమూరు: వానలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ అర్చకులు అనంత పద్మనాభ గిరిపై ప్రత్యేక పూజలు నిర్వహించి వరద పాయం పోశారు. గురువారం శ్రీముఖలింగం ఆలయం పరిధి కరకవలస సమీపంలోని అనంత పద్మనాభ గిరిపై శ్రీముఖలింగం, కరకవలస అర్చకులు, రైతులు కలిసి విష్ణుమూర్తికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు సింహాచలం మాట్లాడుతూ సంప్రదాయ ప్రకారం పద్మనాభ గిరిపై వరద పాయసం పోస్తే వర్షాలు పడతాయని చెప్పారు. కార్యక్రమంలో అర్చకులు శివ, శ్రీకృష్ణ, అచ్యుతరావు, పలువురు భక్తులు పాల్గొన్నారు.


