రణస్థలం: రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతుందని చెప్పడానికి మాజీ మంత్రి సీదిరిపై అప్పలరాజుపై ప్రభుత్వం ప్రదర్శిస్తున్న కక్ష సాధింపే నిదర్శనమని, రోడ్డు ప్రమాదం కేసుకు ఇన్ని అరెస్టులు చేయడం రాష్ట్ర చరిత్రలోనే ప్రప్రథమమని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ మన్యం, శ్రీకాకుళం జిల్లాల రీజనల్ కోర్డినేటర్ బూడి మూత్యాలనాయుడు, జిల్లా పరిశీలకులు, ఎమ్మెల్సీ కుంబా రవిబాబు తెలిపారు. ఈ అక్రమ అరెస్టులను నిరసిస్తూ కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపేందుకు పలాస వెళ్తుండగా రణస్థలం మండల కేంద్రంలో జేఆర్ పురం పోలీసులు హైవేపై నిర్బంధించారు. తొలుత ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్‌ను హౌస్ అరెస్టు చేసి పోలీసులు రణస్థలం పార్టీ కార్యాలయంలో నిర్బంధించారు. తామేమీ సభలు పెట్టడం లేదని పరామర్శకు మాత్రమే వెళ్తున్నామని ముత్యాలనాయుడు అన్నారు. అనంతరం రణస్థలం వైఎస్సార్ సీపీ క్యాంపు కార్యాలయానికి నాయకులను తరలించారు. జిల్లా పరిశీలకు లు, ఎమ్మెల్సీ కుంబా రవిబాబు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రధాన నాయకత్వాన్ని నిర్బంధించడం పద్ధతి కాదని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు రూ. 10 లక్షలు ఇస్తారా అని సూటిగా ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు లంకలపల్లి ప్రసాద్, పిన్నింటి సత్యంనాయుడు, మజ్జి రమేష్, పిల్ల తాత, ఉప్పాడ అప్పన్న తదితరులు ఉన్నారు.
‘ప్రభుత్వం అతిగా స్పందిస్తోంది’
శ్రీకాకుళం క్రైమ్: కూటమి ప్రభుత్వ తీరు అతిగా ఉందని, ఇందుకు మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును ప్రమాదం కేసులో ఇరికించడమే నిదర్శనమని వైఎస్సార్ సీపీ జిల్లా న్యాయ విభాగం అధ్యక్షుడు ఆరంగి లక్ష్మీపతి అన్నారు. చట్టం ముందు అందరూ సమానమే అని నమ్మే వ్యక్తులకు అప్పలరాజుకు జరిగిన అన్యాయం చూస్తే ఆవేదన కలుగుతుందన్నా రు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజల మద్దతు, న్యాయస్థానం ద్వారా తగిన న్యాయం జరుగుతుందని నమ్ముతున్నామని తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకులపై జరుగుతున్న అక్రమ అరెస్టులు ఖండిస్తున్నామన్నారు.


