మత్స్యకారులను అణగదొక్కేందుకే సీదిరి అరెస్టు
● సీదిరి అక్రమ అరెస్టుపై మండిపడిన మత్స్యకారులు
● కక్ష సాధింపు చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీ సామాజిక వర్గం ప్రతినిధులు
టెక్కలి: మత్స్యకార కుటుంబంలో పుట్టి, డాక్టర్‌గా, రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్న సీదిరి అప్పలరాజుపై ఇంతలా కక్ష కట్టి వేధించడం సరికాదని మత్స్యకార మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎల్లకాలం మీరే నాయకులుగా ఉంటారా.. మా లాంటి మత్స్యకార కుటుంబానికి చెందిన వారు రాజకీయంగా ఎదిగితే మీరు సహించరా...ఇలాంటి రాజకీయాలు చేస్తున్న పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష డౌన్...డౌన్’ అంటూ మండిపడ్డారు. సీదిరి అప్పలరాజును కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారనే విషయం తెలుసుకున్న పలువురు మత్స్యకార మహిళలు పోలీస్ స్టేషన్ వద్దకు అప్పలరాజును చూసేందుకు వచ్చారు. అడుగడుగునా పోలీసులు అడ్డుకోవడంతో అసహనం వ్యక్తం చేశారు. మహిళలు అని కూడా చూడకుండా వీరిని పోలీసులు బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించి కొంత దూరంలో విడిచిపెట్టారు. బీసీ సామాజికవర్గం నేతలపై కక్ష కట్టి మరీ టార్గెట్ చేస్తున్నారని, ఇలాంటి చౌకబారు రాజకీయాలు మానుకోవాలని బీసీ సామాజిక వర్గం ప్రతినిధులు డిమాండ్ చేశారు.
గార: మత్స్యకారులను అణగదొక్కేందుకే మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును అరెస్టు చే శారని కె.మత్స్యలేశం, బందరువానిపేట మత్స్యకార నాయకులు గుంటు రామచంద్రరరావు, గనగళ్ల రామారావు, మైలపిల్లి జగదీశ్వరరావు, రాజబాబు అన్నారు. గురువారం కె.మత్స్యలేశంలో స్థానిక మత్స్యకారులతో సమావేశం నిర్వహించారు. మత్స్యకార కుటుంబంలో పుట్టి మంచి డాక్టర్‌గా సేవలందించి మంత్రిగా పేరుగాంచడమే తప్పు అన్నట్టుగా టీడీపీ నాయకుల డైరక్షన్‌లో అరెస్టు చేసి వేధించడం బాధ కలిగిస్తోందన్నారు. కుమారుడు ప్రమాదం చేస్తే తండ్రిని కూడా అరెస్టు చేయడం అన్యాయమన్నారు.
నడిరోడ్డుపై పడేశారు..
మత్స్యకారులం రాజకీయంగా ఎదగకూడదా? అందరూ కలిసి అప్పలరాజు కుటుంబాన్ని అన్యాయంగా నడిరోడ్డున పడేశారు. ఇలాంటి తప్పుడు కేసులు మంచిది కాదు. అప్పలరాజును తక్షణమే విడుదల చేయాలి.
– కె.పుష్ప, మంచినీళ్లపేట,వజ్రపుకొత్తూరు మండలం.
అన్యాయంగా కేసులు పెట్టారు
మా మత్స్యకారులపై ఎమ్మె ల్యే శిరీష కక్ష కట్టారు. అందుకే మా అప్పలరాజును ఎలాగైనా జైల్లో పెట్టాలనుకున్నారు. పిల్లాడిని సైతం జైలులో పెట్టారు. ఇది మంచిది కాదు.
– పి.ఆదిలక్ష్మి, దేవునల్తాడ,
వజ్రపుకొత్తూరు మండలం
బీసీలంటే కూటమి ప్రభుత్వానికి అలుసు
బీసీలు రాజకీయంగా ఎదగకూడదనే విధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. స్వయం కృషితో రాజకీయంగా ఎదుగుతున్న అప్పలరాజును టార్గెట్ చేస్తూ బీసీలను అణగదొక్కడానికి చూస్తున్నారు.
– జి.మోహన్‌రావు, ఎంపీటీసీ, కిష్టుపురం, పలాస మండలం


