పాతపట్నం: మండల కేంద్రంలోని ఉమామహల్ వెనుక ఉన్న టీచర్స్‌కాలనీ సమీపంలో ఆదివారం సాయంత్రం జింక జనారణ్యంలోకి వచ్చింది. జింక రాకను పసిగట్టిన కుక్కలు దాన్ని తరుముతుండడంతో టీచర్స్ కాలనీ వాసులు కుక్కల బారి నుంచి జింకను కాపా డారు. జింక పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది టీచర్స్ కాలనీకు చేరుకుని, స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అటవీ ప్రాంతం నుంచి తాగునీటి కోసం జింక జనారణ్యంలోకి వచ్చి ఉంటుందని స్థానికులు అంటున్నారు.
తెలంగాణ ఇంటర్‌లో జిల్లా వాసుల ప్రతిభ
హిరమండలం: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థిని ఆ రాష్ట్ర ద్వితీయ ర్యాంకర్‌గా నిలిచింది. ఎల్‌ఎన్‌పేట గ్రామానికి చెందిన పల్లా హాసిని ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో 440 మార్కులకుగాను 438 మార్కులు సాధించింది. ఎల్‌ఎన్‌పేట గ్రామానికి చెందిన సింహాచలం, యమునలు వివాహం జరిగిన తర్వాత హైదరాబాద్ వలసపోయారు. హాసిని అక్కడే పుట్టింది. ప్రాథమిక విద్యతో పాటు ఇంటర్ విద్య అక్కడే పూర్తిచేసింది. ఈ క్రమంలో ప్రైవేటు కాలేజీలో చదువుతున్న హాసిని ఏకంగా రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంకర్‌గా నిలవడం విశేషం. ఎల్‌ఎన్‌పేటలో మిగతా కుటుంబసభ్యులతో పాటు బంధు గణం ఉంది. దీంతో హాసినికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇజ్జాడపాలెం అమ్మాయి ప్రతిభ
రణస్థలం: లావేరు మండలం ఇజ్జాడపాలెం గ్రామానికి చెందిన ఇజ్జాడ మేఘన ఆదివారం విడుదలైన తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో సత్తా చాటింది. మేఘన ఎంపీసీలో 466/470 మార్కులు సాధించింది. మేఘన తల్లిదండ్రులు రాంబాబు, త్రివేణి ఇజ్జాడపాలెం నుంచి కొన్నేళ్ల కిందటే హైదరాబాద్‌కు వలస వెళ్లారు.
కంచిలి యువకులు..
కంచిలి: ెపద్దశ్రీరాంపురం, సిర్తలి గ్రామాలకు చెందిన విద్యార్థులు తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరిచారు. పెద్దశ్రీరాంపురం గ్రామానికి చెందిన లమ్మత రమేష్ కుమారుడు లమ్మత అఖిల్ సాయి ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 470కి గాను 467 మార్కులు సాఽధించాడు. ఇతడు రంగారెడ్డి జిల్లా అరంఘర్ ప్రాంతంలో గాయత్రి కాలేజీలో చదువుతున్నాడు. కాలేజీలో అధిక మార్కులు సాధించడంతో యాజమాన్యం అభినందించారు. మండలంలోని సిర్తలి గ్రామానికి చెందిన పైల రామారావు కుమార్తె పైల వైష్ణవి రెడ్డి కూడా తెలంగాణలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంఈసీ గ్రూపులో 500కు గాను 492 మార్కులు సాధించింది.
నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్‌లో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్ని ల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అర్జీదారులు వారి అర్జీలు నేరుగా పై కార్యక్రమంలో లేదా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్జీదారుల అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి గురించి తెలుసుకోవాలంటే 1100కు కాల్ చేయవచ్చని తెలిపారు. అర్జీదారులు గమనించి నేడు నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమో దు, పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


