బాబోయ్‌ పిడుగు | - | Sakshi
Sakshi News home page

బాబోయ్‌ పిడుగు

Apr 10 2026 10:45 AM | Updated on Apr 10 2026 10:45 AM

భయపెడుతున్న పిడుగు ప్రమాదాలు

ఇటీవల కాలంలో వరుసగా పిడుగు మరణాలు

జాగ్రత్తలు పాటించాలంటూ సూచనలు

టెక్కలి, హిరమండలం: కాలం కాని కాలంలో పిడుగులు భయపెడుతున్నాయి. వాతావరణంలో వస్తున్న విపరీత మార్పులతో మేఘాలు కమ్ముకువచ్చి పిడుగుల వాన కురుస్తోంది. జిల్లాలో పిడుగు పాట్లు భయపెడుతున్నాయి. అప్పటి వరకు నిర్మలంగా ఉండే ఆకాశం ఒక్కసారిగా మబ్బులు కమ్ముకోవడం, ఉరుములు రావడం, పిడుగులు పడడం క్షణాల్లో జరిగిపోతోంది. దీంతో తప్పించుకునే అవకాశం కూడా ఉండడం లేదు. ఇటీవల కాలంలో పిడుగుల వల్ల మందస మండలం పెద్దకేశుపురం గ్రామంలో తల్లీకూతుళ్లు మృత్యువాత పడ్డారు. ఇదే మండలం పుచ్చపాడు గ్రామంలో పిడుగు పాటుకు గురై వృద్ధుడు చనిపోయారు. ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామంలో పిడుగు పడి ఆవు మృత్యవాత పడింది. అలాగే కవిటి మండలంలో కొబ్బరి చెట్టు పై పిడుగు పడి మంటలు వ్యాపించిన సంఘటనలు చోటు చేసుకున్నాయి.

ఇంట్లో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

● పిడుగులు సంభవించే పరిస్థితులు కనిపించినప్పుడు ఇంటి తలుపులు, కిటికీలు మూసేయాలి. వాటి ద్వారా కూడా పిడుగు ప్రభావం ఇంటి లోపలకు వచ్చే అవకాశం ఉంటుంది.

● టీవీ, ఫ్రిజ్‌, ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్లు వంటి విద్యుత్‌ పరికరాలను స్విచ్చాఫ్‌ చేయడం ఎంతో శ్రేయస్కరం.

● ముఖ్యంగా చార్జింగ్‌లో ఉన్న ఫోన్లు పక్కకు తీసేయాలి.

● నీటి పైపులు, మెటల్‌ తలుపులు, మోటార్లు వద్ద ఉండకూడదు. నీటి ద్వారా వేగంగా ప్రసరించే ప్రమాదాలు ఉన్నాయి.

ఇంటి బయట ఉన్నప్పుడు..

● బయటకు వెళ్లే సమయాల్లో పిడుగు పడే అవకాశాలు ఉన్నపుడు కాస్త జాగ్రత్తలు పాటించాలి.

● ముఖ్యంగా చెట్ల కింద, పెద్ద టవర్ల దగ్గర, ఎత్తయిన ప్లాట్‌ఫామ్‌ మీద నిలబడకూడదు. ఇవి పిడుగును ఆకర్షించే అవకాశం ఉంటుంది.

● నదులు, సరస్సులు, పెద్ద నీటి ఉపరితలాలు, మైదానాల్లో నుంచి వెంటనే సురక్షితమైన భవనాలు, కార్ల లోపలకు వెళ్లి తలదాచుకోవాలి. కొన్ని సందర్భాల్లో భవనాలు అందుబాటులో లేకపోతే ఎత్తయిన వస్తువులను వదిలి కొంచెం లోతైన ప్రదేశాల్లో తలదాచుకోవడం మంచిది. భూమిపై నిలబడినప్పుడు రెండు కాలు మడమలు కొంచెం దగ్గరగా ‘వి’ ఆకారంలో ఉంచాలి. ఇలా చేస్తే పిడుగు భూమిలోకి వెళ్లే మార్గం తక్కువగా ఉంటుంది.

వీలైతే మోకాళ్ల మీద కూర్చొని, చేతులు మోకాళ్ల మీద లేదా తల మీద ఉంచి, శరీరాన్ని భూమికి వ్యత్యాసం తగ్గించాలి. తడిసిన నేలపై ఉండకుండా పొడి ప్రదేశానికి చేరుకోవాలి. ముఖ్యంగా వాతావరణం చల్లబడే పరిస్థితులు కనిపిస్తున్నపుడు రైతులు త్వరగా ఇళ్లకు చేరుకోవడం ఎంతో మంచిది.

ఇళ్లకు శాశ్వత రక్షణ ఇలా..

పిడుగుపాటుకు గురి కాకుండా ఇళ్లపై కొన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టవచ్చు. ఇళ్లపై, ఎత్తైన భవనాలపై లైట్నింగ్‌ కండక్టర్‌ ఏర్పాటు చేసుకోవాలి. పిడుగు పడినప్పటికీ ప్రమాదం లేకుండా రక్షణగా నిలుస్తుంది. ఇంటి చుట్టూ ఎత్తైన చెట్లు, కర్రలు, అగ్ని ప్రమాదానికి గురి చేసే పదార్థాలు లేకుండా చూసుకోవాలి.

ఇలాంటి రక్షణ చర్యలు పాటిస్తే పిడుగు ధాటికి గురి కాకుండా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా రక్షణగా నిలుస్తాయి.

పిడుగుపాటుకు గురైన వ్యక్తులకు ప్రథమ చికిత్స అందజేసి ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు. పిడుగుపాటుకు గురైన వ్యక్తి నుంచి ఎలాంటి విద్యుత్‌ ప్రసరణ జరగదు. సమీపంలో ఉన్న వారు క్షతగాత్రుడి మెడ కింద భాగంలో రెండు వైపులా ఉన్న కెరోటిడ్‌ పల్స్‌ను పరిశీలించాలి. వెంటనే సీపీఆర్‌ చేయాలి. శరీరం పై కాలిన గాయాలు కనబడితే పొడి గుడ్డతో కవర్‌ చేయాలి. గాలి, వెలుతురు తగిలే విధంగా చూసుకోవాలి. అనంతరం ఆస్పత్రికి తరలించాలి. ముఖ్యంగా వర్షాలు పడే సమయాల్లో పొలాల్లోకి వెళ్లడం, మైదానాల్లో తిరగడం, ద్విచక్రవాహనాలపై ప్రయాణాలు చేయడం, చెట్లు కింద తలదాచుకోవడం మానేయాలి.

– ఎస్‌.గాయత్రి, వైద్యురాలు, కె.కొత్తూరు పీహెచ్‌సీ, టెక్కలి మండలం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement