వేణుగోపాలా..
అద్భుత శిల్ప సంపదకు నెలవు
మెళియాపుట్టి వేణుగోపాల ఆలయం
రేపటి నుంచి డోలోత్సవాలు ప్రారంభం
ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు
జీవకళ ఉట్టిపడేలా!
మెళియాపుట్టిలోని వేణుగోపాల ఆలయం
మెళియాపుట్టి:
జిల్లాలో అద్భుత శిల్ప కళా సౌందర్యం గల దేవాలయాలలో మెళియాపుట్టిలోని వేణుగోపాలుడి ఆలయం ఒకటి. దైవత్వం, జీవకళ ఉట్టి పడేలా ఇక్కడి విగ్రహాలు చూపరులను కట్టిపడేస్తుంటాయి. 1840లో పర్లాకిమిడి(ఒడిశా) మహారాజు ప్రతాపరుద్రుడి భార్య విష్ణుప్రియ మహారాణి కోరిక మేరకు ఈ ఆలయాన్ని అత్యద్భుతంగా కట్టించారు. గర్భగుడిలో ప్రతిష్టించిన మూలవిరాట్ విగ్రహాలను బృందావనం నుంచి తెప్పించినట్లు పూర్వీకుల కథనం. అప్పట్లో బరంపురం పట్టణానికి సమీపంలోని మతర అనే గ్రామానికి చెందిన శిల్పులతో ఆలయంలోని శిల్పాలను చెక్కించారు. 15 ఏళ్ల పాటు ఆలయ నిర్మాణం కొనసాగింది. మైసూరు నుంచి తెప్పించిన తలుపులు, తుమ్మబంకతో కలిపిన రాళ్లు, ఏనుగులతో తొక్కించి తయారుచేసిన ప్రత్యేక మిశ్రమాన్ని ఆలయ నిర్మాణంలో వినియోగించినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు.
అడుగడుగునా ప్రత్యేకమే..
పర్లాకిమిడి రాజవంశస్తులకు రెండో ఎస్టేట్‌గా ఉన్న మెళియాపుట్టిలో 50 గ్రామాల నుంచి వచ్చి న ఫలసాయాన్ని ఆలయంలోని 30 గదుల్లో నిల్వ చేసేవారు. అప్పట్లో 42 మంది అర్చకులు, 25 మంది పనివార్లకు జీతాలు చెల్లించేవారు. స్వామివారికి నిత్యధూప, దీప, నైవేద్యాలకు, సామంతులకు ఇక్కడి నుంచే చెల్లింపులు జరిపేవారు. ఆలయ పరిసరాల్లో లభించే సంపంగి పూలు,జామ, మామిడి తదితర పండ్లతో స్వామివారికి అర్చన చేసేవారు. ఆలయం నుంచి పర్లాకిమిడి బృందావన్ ప్యాలెస్‌గా పిలువబడే రాజు ల ఉద్యానవనానికి సొరంగం ఉండేదని, దాని ద్వారా ఫలసాయం, బంగారు నాణేలు రవాణా చేసేవారని చెబుతుంటారు. ఇప్పటికీ సొరంగ మార్గం ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ ఆలయంలో ప్రస్తుతం ఒక్క అర్చకుడు మాత్రమే ఉన్నారు.
ఏటా ఘనంగా డోలోత్సవాలు
ఏటా స్వామివారి సన్నిధిలో డోలోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది మార్చి 2 నుంచి జాతర ప్రారంభంకానుంది. పర్లాఖిమిడి రాజవంశీయులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు, మఘా కార్యక్రమం నిర్వహించి ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగిస్తారు.
వేణుగోపాలా..


