అపార్‌తో ఎన్నో ప్రయోజనాలు
ఎచ్చెర్ల: ఆటోమేటిక్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) ద్వారా విద్యార్థికి, విద్యా సంస్థలకు భద్రతతో కూడిన గుర్తింపు, ప్రయోజనాలు సాధ్యమవుతాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖకు చెందిన డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ప్రాంతీయ సమన్వయకర్త రవిపాండే అన్నారు. ప్రతి విద్యాసంస్థ, విశ్వవిద్యాలయాలు దీన్ని అనుసరించాలని కేంద్రం ఇప్పటికే మార్గదర్శకాలు ఇచ్చిందని తెలిపారు. యూజీసీ నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (ఎన్.ఎ.డి) రాష్ట్ర ఉన్నత విద్యామండలితో కలిసి బిఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ‘అపార్’పై రాష్ట్ర స్థాయి వర్క్‌షాపును గురువారం నిర్వహించింది. రీసోర్స్ పర్సన్‌గా పాల్గొన్న రవిపాండే మాట్లాడుతూ అపార్‌లో విద్యార్థి వివరాలు నమోదు చేసుకుంటే అతనికి సంబంధించి అకడమిక్ డేటా, సర్టి ఫికెట్లు, సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలకు డిజి లాకర్‌లో పూర్తి భద్రత ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థి ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు వీటిని పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఆధార్, పాన్‌లాగే విద్యార్థులందరికీ అపార్ కార్డు ఉపయోగపడుతుందని తెలిపారు. అపార్, సమర్థ్ రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ పి.అనిల్‌కుమార్ మాట్లాడుతూ వాట్సాప్, ఈ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలు అందుకోవడానికి అపార్, సమర్థ్ యాప్‌లు ఉపయోగపడతాయన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య బి.అడ్డయ్య మాట్లాడుతూ బిఆర్‌ఏయూ పరిధిలో సుమారు 32,451 మంది విద్యార్థులకు అపార్ ఐడీ నమోదు చేశామని, ఆరు లక్షల ఎనభై వేలకు పైగా విద్యార్థుల వివరాలు ఎన్‌ఏడీకి పంపించామని తెలిపారు.


