జనసేన మౌనమెందుకు..?
● ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై నర్తు రామారావు ఘాటు విమర్శలు
ఇచ్ఛాపురం రూరల్: జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధ్యత గల పదవిలో ఉంటూ మహిళా ఉద్యోగిని భయపెట్టి, లైంగికంగా వేధించడం అత్యంత దారుణమని ఎమ్మెల్సీ నర్తు రామారావు పేర్కొన్నారు. ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రజాప్రతినిధులు నైతిక విలువలకు ఆదర్శంగా ఉండాల్సిన సమయంలో ఇలాంటి వ్యవహా రాలు ప్రజలను నిరాశకు గురి చేస్తున్నాయని తెలిపారు. ఈ ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పటికీ నోరు మెదపకపోవడం అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. మహిళా సాధికారత, నైతికత గురించి ఉపన్యాసాలు ఇచ్చే పవన్ కల్యాణ్ తమ పార్టీ నేతల విషయంలో మౌనం పాటించడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏ, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఇలా వరుసగా ఘటనలు వెలుగు చూస్తు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకుల నిర్లక్ష్యమే ఈ తరహా అక్రమాలకు ప్రోత్సాహం ఇస్తోందని ఆరోపించారు.
ప్రజల నుంచి ఓట్లు తీసుకుని అధికారంలోకి వచ్చిన నాయకులు వ్యక్తిగత జీవితాల్లో కూడా బాధ్యతగా ఉండాలన్నారు. మహిళా ఉద్యోగుల భద్రత, గౌరవం చంద్రబాబు పాలనలో ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం, మహిళా కమిషన్ తక్షణమే నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితురాలికి న్యాయం చేసి, ఎమ్మెల్యే శ్రీధర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


