వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
జి.సిగడాం: మండలంలోని సీతంపేట కూడలి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రగాయాలు పాలయ్యారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. నిద్దాం గ్రామానికి చెందిన చౌదరి సూర్పనాయుడు(45), అదే గ్రామానికి చెందిన సర్పంచ్ భర్త పొదిలాపు ఆదినారాయణ ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై రాజాం వెళ్లారు. అక్కడనుంచి తిరిగి ఇంటికి వస్తుండగా పొగిరి – పాలఖండ్యాం గ్రామాల మధ్యలో ఉన్న సీతంపేట కూడలి వద్ద అదుపుతప్పి వ్యాన్‌ను ఢీకొన్నారు. ప్రమాదంలో సూర్పనాయుడు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆదినారాయణకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108 ద్వారా ఆదినారాయణను రాజాం అస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య గౌరమ్మ, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నిద్దాం గ్రామంలో బుధవారం నుంచి నిద్దాలమ్మ తల్లి యాత్ర మహోత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ యాత్రకు పూజారులుగా సూర్పనాయుడు కుటుంబ సభ్యులు వ్యహరించారు. మరణవార్త తెలియగానే గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెచ్‌సీ రమణ తెలిపారు.
● యువకుడికి తీవ్ర గాయాలు
రణస్థలం: లావేరు మండల కేంద్రానికి సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇజ్జాడపాలెం గ్రామానికి చెందిన తిమిరి దుర్గ ప్రసాద్ తలకు బలమైన గాయం కావడం పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు. అలాగే మరో యువకుడు ప్రమాద స్థలం నుంచి ద్విచక్ర వాహనం ఆపకుండా వెళ్లిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కల్వర్టును ఢీకొని..
కంచిలి: మండలంలోని మఠం సరియాపల్లి పంచాయతీ పరిధి నారాయణబట్టి గ్రామం వద్ద మంగళవారం రాత్రి ముండ్ల గ్రామానికి చెందిన దుర్యోధన ప్రధాన్(35) అనే వ్యక్తి ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో కల్వర్టును ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతడు మఠం సరియాపల్లి గ్రామం వైపు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతుడికి భార్య భువనేశ్వరి ప్రధాన్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడు విదేశాల్లో ఉపాధి పొందుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంతలో ఈ ప్రమాదం జరిగి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. కంచిలి ఎస్‌ఐ పి.పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి


