ప్రభుత్వ పోరంబోకు స్థలం కబ్జా..?
కంచిలి: మండలంలో ముఖ్య వ్యాపార కూడలిగా పేరున్నటువంటి మఠం సరియాపల్లి గ్రామంలో మెయిన్‌రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ పోరంబోకు స్థలం కబ్జాకు గురవుతోంది. సుమారు 8 మూరల వెడల్పు, 60 అడుగుల పొడవు గల స్థలాన్ని స్థానిక టీడీపీ నేత ఒకరు ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సర్వే నంబర్ 198(1)లో ఈ ప్రభుత్వ పోరంబోకు స్థలం ఉన్నట్లు చెబుతున్నారు. ఇది సుమారు రూ.25 లక్షల వరకు మార్కెట్ విలువ ఉంటుందని సమాచారం. ఈ స్థలం వెనుక ఆ నేతకు సంబంధించిన జిరాయితీ స్థలం ఉండడంతో ముందున్న పోరంబోకు స్థలాన్ని ఆక్రమించడానికి అవసరమైన గ్రావెల్‌ను తెప్పించి, అందులో పోసి స్థలాన్ని ఎత్తు చేశారు. దీంతో స్థానికంగా ఈ ఆక్రమణ విషయం చర్చనీయమైంది. ఈ స్థలంలో జగనన్న పాల సేకరణ కేంద్రం, పశువైద్యశాల, మార్కెట్ కాంప్లెక్స్‌లు నిర్మించడానికి సర్వే చేయించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఇక్కడ కొంతస్థలంలో మార్కెట్ కాంప్లెక్స్ నిర్మించగా, మిగతా స్థలం ఖాళీగా ఉంది. స్థలంలో గతంలో కూడా ఆక్రమణపై వివాదం ఏర్పడడంతో సమస్య కోర్టు వరకు వెళ్లింది. దీనిపై కోర్టు స్పందించి ప్రభుత్వ పోరంబోకు స్థలంగా నిర్ధారించింది. తాజాగా స్థానిక టీడీపీ నేతకు చెందిన జిరాయితీ స్థలం ముందు ఉండడంతో, ఆక్రమించి నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నిస్తున్నాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై రెవెన్యూ అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేపట్టి, ప్రభుత్వ పోరంబోకు స్థలంలో జరుగుతున్న ఆక్రమణను అడ్డుకోవాలని స్థానిక సర్పంచ్ కొణపల సురేష్, ఎంపీటీసీ సభ్యుడు బుడ్డెపు విశ్వనాథం తదితరులు డిమాండ్ చేశారు. దీనిపై తహసీల్దార్ ఎన్.రమేష్‌కుమార్‌ను వివరణ కోరగా.. సమగ్రంగా దర్యాప్తు చేసి, తదుపరి చర్యలకు ఉపక్రమిస్తామని తెలిపారు.


