
అల్పపీడనంతో విద్యుత్ శాఖ అప్రమత్తం
శ్రీకాకుళం న్యూకాలనీ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా జిల్లాలో వర్షాలు పడుతున్నాయని, ఈ నెల 17 వరకు భారీ వర్షాలతోపాటు ఈదురు గాలులు వేసే అవకాశం ఉన్నందున విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీఈడీసీఎల్ శ్రీకాకుళం సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ నాగిరెడ్డి కృష్ణమూర్తి సూచించారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. తడి విద్యుత్ స్తంభాలను తాకవద్దని, వేలాడుతున్న వైర్లను పట్టుకోవద్దని, వాటి కింద నడవవద్దని, చెట్లపై పడిన విద్యుత్ వైర్లకు దగ్గరగా పోవద్దని సూచించారు.
మూడు డివిజన్లలో హెల్ప్‌డెస్కులు..
రానున్న మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లాలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలగవచ్చని, ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయాల్లో విద్యుత్ వినియోగదారుల అవసరార్ధం హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశామని చెప్పారు. శ్రీకాకుళం డివిజన్(9490610045), టెక్కలి డివిజన్(8332843546), పాతపట్నం డివిజన్(7382585630) ప్రజలు ఈ నంబర్లను సంప్రదించాలని కోరారు. విద్యుత్ సరఫరాలో లోపాలు, విద్యుత్ వైర్లు పడిపోయిన/వేలాడుతున్న విద్యుత్ స్తంభాలు కనిపించిన వెంటనే సంబంధిత హెల్ప్ డెస్క్‌కి సమాచారం అందించాలని కోరారు.
255 మంది సిబ్బంది..
ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా 255 మంది సిబ్బందిని నియమించినట్టు నాగిరెడ్డి చెప్పారు. 15 వాహనాలు, 13 క్రేను, ఆరు పోల్ డ్రిల్లింగ్ మెషీన్లు, 30 పవర్ సాస్, 150 ట్రాన్స్‌ఫార్మర్లు, 500 విద్యుత్ స్తంభాలను సిద్ధం చేసినట్లు వివరించారు. పూర్తి వివరాలకు శ్రీకాకుళం సర్కిల్ హెల్ప్ డెస్క్: 9490612633, ఏపీఈపీడీసీఎల్ టోల్ ఫ్రీ: 1912 నంబర్లను సంప్రదించవచ్చని ఎస్‌ఈ పేర్కొన్నారు.