
ఉద్యోగులకు ‘పీపీపీ’ సర్వే షాక్
అరసవల్లి: కూటమి ప్రభుత్వం తెచ్చిన సర్వేలు ఉద్యోగుల కొంపముంచుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల్లో దర్శనాలు, పారిశుద్ధ్యం, సౌకర్యాలు, అన్నదాన ప్రసాదాలతో పాటు సిబ్బంది చేపడుతున్న చర్యలపై భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకునే విధానం (సానుకూల ప్రజా అవగాహన) మొదలైన సంగతి విదితమే. ఈ క్రమంలో అరసవల్లి సూర్యనారాయణ స్వామిఆలయంలో కూడా పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ (పీపీపీ) పేరిట జరుగుతున్న ఈ సర్వేల్లో భక్తుల అభిప్రాయాలన్నీ నమోదవుతుంటాయి. ఇదే క్రమంలో ప్రసాదాలు, సౌకర్యాలు, దర్శనాలు, పారిశుద్ధ్యం నిర్వహణలో గత మే, జూలై నెలల్లో భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. ఇందులో పారిశుద్ధ్య నిర్వహణపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సంబంధిత విభాగాన్ని పర్యవేక్షిస్తున్న సీనియర్ అసిస్టెంట్ శోభనాద్రాచార్యులను విధుల నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సర్వే ఆధారంగా ఏకంగా విధుల నుంచి సస్పెన్షన్ చేయడంపై ఆలయ వర్గాలు విస్మయానికి గురవుతున్నారు.
ఎలా సాధ్యం?
సూర్యనారాయణ స్వామి ఆలయం అరసవల్లి గ్రామంలో భాగంగా ఉందన్న సంగతి తెలిసిందే. ప్రధాన రహదారికి ఆనుకుని ఉండటంతో పాటు ఆలయమంతా ఒకే ప్రాకారంలో లేకపోవడంతో బయట పారిశుద్ధ్య నిర్వహణ, పర్యవేక్షణ ఆలయ ఉద్యోగులకు సాధ్యం కాదు. పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేకంగా సిబ్బంది నియామకాలు చేపట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నలుగురు రెగ్యులర్ ఉద్యోగులపై ఇలాంటి చర్యలు చేపట్టడం తగదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పనికొచ్చే సర్వేలు చేపడితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆదిత్యాలయ పరిధిలో శానిటేషన్
నిర్వహణ బాగోలేదని ఫీడ్‌బ్యాక్
సీనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
విస్మయం చెందుతున్న సిబ్బంది