
హేతుబద్ధత లేని వర్గీకరణ ఆపాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: హేతుబద్ధత లేని వర్గీకరణను తక్షణమే నిలుపుదల చేయాలని జాతీయ రెల్లి ఎస్సీ గ్రూపు కులాల సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పి.సుధాకర్ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా రెల్లి గ్రూపు కులాలకు జరగనున్న అన్యాయాన్ని నిరసిస్తూ నగరంలోని పెద్దరెల్లివీధి నుంచి ఏడురోడ్ల జంక్షన్ మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ బుధవారం నిర్వహించారు. కలెక్టరేట్ చేరుకొని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం జాతీయ ప్రధాన కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ.. రాజకీయ ప్రాతినిధ్యం లేని కులాలకు ప్రభుత్వమే బాధ్యత తీసుకొని రాజ్యాంగ ఫలాలను అందజేయాలని కోరారు. రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ నియామకాల్లో ఆర్టికల్ 371 (డి) అనుసరించి జిల్లా, జోన్, రాష్ట్రంలో అవకాశాలు కల్పించాలని కోరారు. అలా కాని పక్షంలో రెల్లి గ్రూపు కులాల అభ్యర్థులకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వర్గీకరణను వ్యతిరేకించడం లేదని, హేతుబద్ధత లేని వర్గీకరణను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలు, సలహాల మేరకు వర్గీకరణ చేయాలని కోరుతున్నామన్నారు. దీనిలో భాగంగా రెల్లి గ్రూపు కులాల విద్యా, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం ప్రత్యేకమైన నిధులు కేటాయించి, వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం పెద్ద మనసుతో సహకరించాలని విన్నవించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అర్జి కోటి, నగర అధ్యక్షుడు ఎ.ఈశ్వరరావు, రెల్లి ఉప కులాల నాయకులు కాశీ రథో, గోడలి మిన్ను, దండాసి దుర్యోధన, బైరి శివప్రసాద్, దేవర రాము, లోకొండ లక్ష్మణరావు, మజ్జి బాబ్జి, విశాఖపట్నం రవి, వీరగొట్టం ఆనంద్, రణస్థలం ఫణి కుమార్, జలగడుగుల శ్రీరామ, కె వెంకటరావు, జె గోవిందరావు, ఎ.గోవిందరావు, విజయ్, ఎం.రామారావు, జె.శ్రీను, ఇంటి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.